తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి మాతృమూర్తి శ్రీవకుళమాత ఆలయ క్రతువును వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 900 ఏళ్ల చరిత్ర కలిగి, 350 ఏళ్ల పాటు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో పునరుద్ధరణ చేశారు. ఆలయ మహా సంప్రోక్షణకు సంబంధించిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు.
వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
నాటి వైభవం సాక్షాత్కరించేలా ఆలయాన్ని తీర్చిదిద్దడంలో కృషి చేసిన స్థపతి సూరిబాబు, దారుశిల్పి మహేష్, స్వర్ణకారులు శ్రీనివాస్‌లను సీఎం సత్కరించారు. వారికి స్వర్ణ కంకణాలను బహూకరించారు. అమ్మవారి విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్, ఆలయంలో మెటల్ వర్క్‌ను అద్భుతంగా చేసిన సారథిలను దుశ్శాలువతో సత్కరించారు.
చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో జరుగుతున్న మహా సంప్రోక్షణలో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోని పరిమళ పుష్కరిణిలో నీటిని సీఎం తలపై చల్లుకున్నారు. కోనేరు వద్ద టీటీడీ అధికారిక వృక్షం అయిన మానుసంపంగి మొక్కను నాటారు.