థర్డ్ ఫ్రెంట్ అంటూ హడావుడి చేస్తూ సమయం దొరికినప్పుడల్లా కేంద్రంపై, మోదీపై విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ తన మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సహచరులకు ఫోన్ చేసి ఉన్నపళంగా తన ఫాంహౌస్ కు రావాలని పిలిచారు. మంత్రులు హరీష్, తలసాని, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితారెడ్డి తో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులకూ సమాచారం వెళ్లింది. సీఎం ఆదేశంతో వాళ్లంతా హుటాహుటిన ఎర్రవెల్లి ఫాంహౌస్ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో ఉన్నకారణంగా కేటీఆర్ సమావేశానికి హాజరుకాలేకపోయారు. అయితే ఎమ్మెల్సీ కవిత మాత్రం తండ్రితో ఫాంహౌస్ లోనే ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగ నోటిఫికేషన్ల గురించే సీఎం వారితో ప్రధానంగా చర్చించారని చెబుతున్నా…థర్డ్ ఫ్రెంట్ కూర్పులో బిజీగా ఉన్న ఆయన జాతీయరాజకీయాల్లో తాను పోషించబోయే పాత్ర గురించి వారితో చర్చించేందుకే సమావేశం ఏర్పాటు చేసినట్టు మరికొందరు చెబుతున్నారు. ఇక ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం రాష్ట్రంలో సర్వేను వేగవంతం చేసిందన్న వార్తలూ హల్ చల్ చేస్తున్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)