అత్యాచార కేసులు పెరగడానికి కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిందించారు. అత్యాచార నిందితులను ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా రేప్‌లు, హత్యలు ఎక్కువయ్యాయని గెహ్లాట్ కేంద్రాన్ని నిందించారు. నిర్భయ కేసు తర్వాత.. దోషులకు ఉరిశిక్ష విధించే చట్టం కారణంగా అత్యాచారం తర్వాత హత్యలు ఎక్కువయ్యాయి. ఇది దేశంలో ప్రమాదకరమైన ధోరణి అని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, నిరుద్యోగం తదితర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఆయన ఢిల్లీలో ఈ విధంగా స్పందించారు. అయితే అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రకటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
నిర్భయ కేసులో బాధితురాలి తల్లి సీఎం అశోక్ గెహ్లాట్ అత్యాచార వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వల్లే నిర్భయ కేసులో న్యాయం జరిగిందని ఆమె అన్నారు. అశోక్ గెహ్లాట్ మనస్తత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే తనకు న్యాయం జరిగేది కాదని అన్నారు. ఇవి అవమానకరమైన వ్యాఖ్యలు. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ వయసులో ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా బాధాకరం. ఇలాంటి వారు ముఖ్యమంత్రి ఎలా అవుతారో తెలియదని ఆమె అన్నారు. దేశంలో ఎందరో బాలికలు, మహిళలు ఇబ్బందులు పడుతున్నా వారికి న్యాయం జరగడం లేదు. మైనర్ బాలికలపై అత్యాచారం చేసి చంపేస్తున్నారన్నారు. ఏ విధంగా ఉరిశిక్ష వల్ల హత్య ఘటనలు పెరుగుతాయని అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఆడపిల్లలపై అత్యాచారం చేసి చంపేద్దామా? మరి దోషుల సంగతేంటి? వారిని తప్పించాలా? రేపిస్ట్ లను విడుదల చేయాలి అని ఆయన చెప్పాలనుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు.
2012లో ఢిల్లీలోని నిర్భయ గ్యాంగ్ రేప్ తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దాంతో కేంద్రం 2013 చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఈ మేరకు చట్టంలో సెక్షన్ 376, 376A, 376D తోపాటు దోషికి మరణశిక్ష విధించడానికి సెక్షన్ 376Eని జోడించారు.