కోవిద్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను మూసివేస్తున్నట్టు విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
‘దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది… పొరుగురాష్ట్రాల్లో జడలు విప్పుతోంది. విద్యాసంస్థల్లో కూడా అక్కడక్కడా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున మరింత ప్రమాదకరంగా పరిస్థితులు మారవచ్చని భావిస్తున్నాం. ఇప్పటికే యూపీ, మధ్యప్రదేశం, మహారాష్ట్ర, పంజాబ్,తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలు పాఠశాలల్ని మూసివేశాయి. తెలంగాణ ప్రభుత్వానికి కూడా తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అందుకే పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి సభలో తెలిపారు.
ఈ ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయని సబిత పేర్కొన్నారు.