మన తెలుగు సినిమాల్లో చిత్రగుప్తుని ఒక కమెడియన్ గా చిత్రీకరిస్తారు యమధర్మరాజు కధాంశంతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి దీంతో చిత్రగుప్తుంటే పూర్తిగా కమెడియన్ గా ముద్ర వేసేసారు కానీ నిజానికి చిత్రగుప్తుడు దైవంశ సంభూతుడు.
చిత్రగుప్తుని ఆవిర్భావమే విచిత్రంగా జరిగింది అని చెబుతారు.
సృష్టి ఆదిలో ఆయువు తీరిన జీవులన్నీ పరలోకం చేరాయి. పాపపుణ్య విచారణలో యముడు తీవ్ర గందరగోళానికి గురయ్యాడు. బ్రహ్మకు తన బాధను మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ ఆలోచిస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోవడంతో సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఆయన శరీరం నుంచి నడుముకు ఒక కత్తి కట్టుకుని , కలం , కాగితాల కట్టను చేతుల్లో పెట్టుకుని ఒక దివ్యపురుషుడు ఉద్భవించాడు. బ్రహ్మ అతన్ని యమలోకంలో పద్దుల నిర్వహకుడిగా నియమించాడు. అతనే చిత్రగుప్తుడు.
ఇంకో కథనం ప్రకారం..
సూర్యవంశానికి చెందిన చిత్రుడు చాలా కాలం పాటు సూర్యుని ఆరాధించాడు. దానికి సంతోషించి సూర్యుడు సర్వజ్ఞత అనుగ్రహించాడు. ఆదిత్యుని అనుగ్రహాన్ని పొందినందున అతనికి చిత్రాదిత్యుడనే పేరు వచ్చింది. ఇలాంటి కార్యదక్షుడు తన దగ్గర ఉంటే బాగుంటుందని యముడు అనుకున్నాడు. చిత్రాదిత్యుడు సముద్ర స్నానానికి వెళ్లినప్పుడు యమదూతలను పంపి అతన్ని సశరీరంగా తనసదనానికి తెప్పించుకున్నాడు. గుప్తంగా తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున చిత్రాదిత్యుడికే చిత్రగుప్తుడనే పేరు వచ్చింది.
ప్రధానంగా పాతకాలపు వ్యాపారులు చిత్రగుప్త పూజను నిర్వహిస్తుంటారు. ఈ రోజున తమ ఆదాయ , వ్యయాల రికార్డులను చిత్రగుప్తుని పటం ముందు ఉంచి ప్రార్థిస్తారు. బిహార్లో జరిపే ఛత్ పూజ కూడా చిత్రగుప్తుడికి సంబంధించినదే. ఎర్రటి వస్త్రంపై కలం , సిరాబుడ్డి , కత్తి , ఖాతా పుస్తకాలను ఉంచి పూజిస్తారు. చిత్రగుప్త పూజలో పసుపు , తేనె , ఆవాలు , అల్లం , బెల్లం , చక్కెర , గంధం , సిందూరం సమర్పిస్తారు. కేతువు అనుగ్రహం కోసం ఓం శ్రీ చిత్రగుప్తే నమః అనే మంత్రాన్ని జపిస్తారు.
జీవుల సంస్కారాన్ని అనుసరించి వారి పాపపుణ్యాలను లిఖించాలని , చిత్రగుప్తున్ని బ్రహ్మ ఆదేశించినట్లు బృహత్ బ్రహ్మ ఖండంలో ఉంది. యజ్ఞయాగాదుల్లో హవిసులు చిత్రగుప్తునికి చెందుతాయని పద్మపురాణం పేర్కొంటోంది. న్యాయ దేవతగా కూడా ఆయనను అభివర్ణించారు. యమ సంహితలో అత్యంత బాధ్యతాయుత విధుల్లో యమునికి సహాయం చేస్తుంటాడని ఉంది. జీవుల పుట్టుక నుంచి మరణం దాకా ప్రతి చర్యనూ నిగూఢంగా పరిశీలించి లిఖిస్తుంటాడు. శారీరక పాపాలతో పాటు మానసిక దోషాలను కూడా సంగ్రహించగలిగే అతీంద్రియ జ్ఞానం ఇతనికి ఉంది. చిత్రగుప్తుడు లెక్కతేల్చిన అనంతరం యమధర్మరాజు ఆ ఆత్మకు తగిన శరీరాన్ని నిర్ణయించి పునర్జన్మను ప్రసాదిస్తాడు.
అటువంటి చిత్రగుప్తుడి దేవాలయం కేవలం హైదరాబాద్ లోనే ఉంది. పాతబస్తీలో ఫలక్ నుమా ప్యాలెస్ దాటినాక చిత్రగుప్తుని ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికీ క్రమం తప్పకుండా పూజలు నిర్వహిస్తారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నవాళ్లు చిత్రగుప్తుడు ని ఆరాధిస్తే సక్రమంగా ఆదాయం పొందుతారు అని భక్తులు నమ్మకం.