కాశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి వెనుక చైనా సంస్థల హస్తం ఉందన్న అనుమానాల వినిపిస్తున్నాయి. సరిహద్దుల్లో భద్రతా బలగాలు తేలికగా ప్రయాణించడానికి వీలుగా కొన్ని సొరంగ మార్గాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు అడ్డుకునేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.
తాజాగా కాశ్మీర్ లోయలో జరిగిన దాడిలో భవన నిర్మాణ కార్మికులు ఏడు మంది చనిపోయారు. జెడ్-మోర్ సొరంగ నిర్మాణ ప్రదేశంలో దాడిచేసిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ ఈ దాడిని వ్యూహాత్మక దాడిగా పేర్కొంది. అంతేకాదు, ‘తూర్పు సరిహద్దుల్లో భారత సైన్యం మోహరింపునకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది..అని ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ ఈ దాడి ని క్లేమ్ చేసుకున్నప్పటికీ,, దీని వెనుక చైనా సంస్థల హస్తం ఉంది అని తెలుస్తుంది. భారత సైన్యం రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు వివిధ రూపాలలో ఉగ్రవాదులకు చైనా సంస్థలు సహకారం అందిస్తున్నట్లు నిఘావర్గాల అంచనా.
దాడి జరిగిన సొరంగం మార్గం సైనిక బలగాలకే కాకుండా పౌర సమాజానికి కూడా ఎంతో ఉపయోగకరం. శ్రీనగర్ జాతీయ రహదారిపై కశ్మీర్ నుంచి లడఖ్‌ను కలిపే 6.5 కిలోమీటర్ల పొడవైన సోన్మార్గ్ సొరంగం అత్యంత కీలకమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ అనుసంధానం జరిగేలా దీనిని డిజైన్ రూపొందించారు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఏపీసీఓ ఇన్ఫ్రాటెక్ నిర్మాణ పనులు చేపట్టింది. వచ్చే నెలలోనే దీనిని ప్రారంభించనున్నారు. ‘ఆక్రమిత భూభాగంలో సైనిక ప్రాజెక్టులు మరణానికి ఉచ్చులు.. కాబట్టి, తెలివైన ప్రతి ఒక్కలూ వాటికి దూరంగా ఉండాలి.. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణ పనులకు స్థానికులతో పాటు స్థానికేతర కార్మికులు దూరంగా ఉండాలి.. ఇటువంటి నిర్మాణ ప్రదేశాల్లో దాడులు తప్పవు’ అని ఉగ్రవాదులు హెచ్చరించారు.
ఈ వాదనలు, ఆరోపణలను భారతదేశ అధికారులు ఖండిస్తున్నారు. సున్నితమైన ప్రాంతంలో ఈ సొరంగం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. కాబట్టి సొరంగాన్ని కేవలం సైనిక ప్రాజెక్ట్‌గా పేర్కొనడం తప్పుదారి పట్టించడమేనని చెప్పారు.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సాజిద్ గుల్ ఆదేశాలతోనే ఉగ్రదాడి జరిగింది.
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న సాజిద్ గుల్‌పై రూ.10 లక్షల రివార్డు ఉంది. ఆదివారం రాత్రి ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు నిర్మాణ ప్రదేశంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మెస్‌లో కార్మికులు భోజనాలు చేస్తున్న సమయంలోనే ఈ దాడి చోటుచేసుకుంది.
ఇటువంటి దాడులతో సైనిక బలగాలు ఏమాత్రం వెనకడుగు వేయవు అని సైన్యం చెబుతోంది. మరింత పటిష్టమైన భద్రతను కల్పించి,, ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.