
వివాదాలకు కేంద్రంగా నిలిచిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ త్వరలోనే రిటైర్ అయిపోతున్నారు. ఆయన స్థానంలో వారసునిగా జస్టిస్ సూర్య కాంత పేరు బలంగా వినిపిస్తోంది. సాంప్రదాయం ప్రకారం అత్యంత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తికే అవకాశం ఇస్తారు. నిబంధనల ప్రకారం ప్రస్తుత సీజేఐ తర్వాత సీనియర్‌గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభిస్తుంది. ఈ మేరకు తగిన సమయంలో కేంద్ర న్యాయ శాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా సీజేఐ పదవీ విరమణకు నెల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జస్టిస్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనకే సీజేఐగా అవకాశం దక్కనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులైతే నవంబరు 24న ఆయన బాధ్యతలు చేపడతారు. ఆయన దాదాపు 15నెలల పాటు అంటే 2027 ఫిబ్రవరి 29 వరకూ సీజేఐగా కొనసాగుతారు.
జస్టిస్ సూర్యకాంత్ 2004 జనవరి 9న పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2018 అక్టోబరు 5న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. అన్నీ అనుకూలిస్తే ఆయనే ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. వివాదాలకు దూరంగా నిలిచే న్యాయకోవిదునిగా సూర్య కాంత ను చెబుతూ ఉంటారు.




