చెన్నైలో జరిగిన చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ స్వదేశానికి తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. భారతదేశం తొలిసారిగా ఆతిథ్యమిచ్చిన 44వ చెస్ ఒలింపియాడ్ ను ప్రధాని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. అంతకుముందు ఐఎన్ఎస్ అడయార్ నుంచి కారులో స్టేడియానికి వస్తున్న మోదీకి అభిమానులు దారి పొడవునా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. చెస్ గళ్ల బోర్డర్ ఉన్న షాలువా, లుంగీ ధరించిన మోదీ ఎంతో ప్రత్యేకంగా కనిపించారు.
“అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ తిరిగి భారత్ కు వచ్చింది. చెస్ ఒలింపియాడ్ దాని మూల ప్రదేశంలో నిర్వహించటం ఇదే మొదటిసారి. ఇది మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఆసియాలో జరుగుతోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
“క్రీడలను ఎప్పటి నుంచో దైవంగా పరిగణించే దేశం మనది. తమిళనాడులో మీరు వెతికితే.. ఇక్కడే శతురంగనాథన్ ఆలయం ఉంది. ఇక్కడ దేవుడు కూడా చదరంగం ఆడాడు. తమిళనాడుకు చదరంగంతో బలమైన చారిత్రక సంబంధం ఉంది. అందుకే ఈ రాష్ట్రం భారతదేశానికి చెస్ పవర్‌హౌస్ గ ఉంది. తమిళనాడు చాలా మంది గ్రాండ్‌మాస్టర్ లను తయారు చేసిందని.. ప్రపంచంలోనే పురాతన భాషకు నిలయంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్లో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఆడలేదు కానీ ఆటగాళ్లకు మెంటార్ పాత్రలో కనిపించనున్నారు.
పొరుగున ఉన్న ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఒలింపియాడ్ ను రష్యా నుంచి భారతదేశానికి కేటాయించారు.