తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనెల 17 శుక్రవారంనాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రానున్నారు. నిర్మల్ లోని వెయ్యి ఉరుల మర్రి దగ్గర నాటి అమరులకు ఆయన నివాళులు అర్పించనున్నారు. అమిత్ షా రాక సందర్భంగా ఆ చారిత్రక ప్రదేశం..నాటి చారిత్రక ఘట్టం ప్రస్తావన మరోసారి చర్చలోకి వచ్చాయి.
జాతీయోద్యమంలో యావత్భారతాన్ని కదిలించిన జలియన్ వాలాబాగ్ లాంటి మరో దారుణ మారణ కాండకు నిర్మల్ వేదికైంది. అంతకు యాభై ఏళ్ల క్రితమే నిర్మల్‌లో ఒకేసారి వెయ్యిమంది స్వాతంత్ర్యవీరులు ఊపిరులొదిలారు.
ఉత్తర భారతంలో ఝాన్సీ రాణి,తాంతియాతోపేల సారధ్యంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరగ్గా…ఆ సమయంలోనే ఇటువైపు బ్రిటిష్-నిజాంలపై గోండు యోధుడు రాంజీగోండ్ నిర్మల్ కేంద్రంగా వీరోచిత పోరాటం చేశాడు.
ఒక్కసారి చరిత్రలోకి వెళితే..బ్రిటిష్ పాలనకు ముందే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణలోని ప్రాంతాలతో కూడిన గోండ్వానా రాజ్యం ఉండేది. మరాఠాల పతనం తర్వాత గోండ్వానాను బ్రిటిష్ వాళ్లు, నిజాములు ఆక్రమించుకున్నారు. బలహీనపడినా గోండులు వారిని ప్రతిఘటించేవారు. 1836-1860 దాకా రాంజీగోండ్ నాయకత్వంలో పోరాటం నడిచింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఉత్తరాది నుంచి ఝాన్సీ, తాంతియాతోపే సేనల్లోని రోహిల్లాలు కూడా వచ్చి రాంజీతో చేతులు కలిపారని చెబుతారు.. పర్బనీ, నిర్మల్ ప్రాంతాలతో పాటు అజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్ వంటి ప్రాంతాల్లో వారి పోరాటం సాగింది.
రాంజీగోండు అనుచరుల్ని విస్తరించుకుంటూ పోరాటం సాగిస్తున్న కాలంలోనే ఓ దారుణమారణ కాండ జరిగింది నిర్మల్ లో. 1860 ఏప్రిల్ 9న రాంజీగోండ్…తన అనుచరులతో నిర్మల్‌కు సమీపంలో ఉన్నట్లు నాటి బ్రిటిష్ పాలకులు, అధికారులకు సమాచారం అందింది. కేవలం ఇద్దరు మాత్రమే పక్కపక్కన నడుస్తూ వెళ్లగలిగే ఆ ఇరుకు ప్రాంతాన్ని నిజాం పోలీసు బలగాలతో పాటు బ్రిటిష్ సైన్యం ముట్టడించింది. ఆ రోజు పోరులో రాంజీ సైన్యం బ్రిటిష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. అయితే మరునాడు పెద్దఎత్తున సైన్యం దిగింది. సోన్ ప్రాంతంలో రాంజీగోండ్ వారికి బందీగా చిక్కారు. రాంజీవంటి వాళ్లు మరిక రావద్దని…ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలనుకున్న సైన్యం… రాంజీతో పాటు పట్టుబడ్డ అతని వెయ్యి మంది అనుచరులను అక్కడున్న మర్రిచెట్టు ఊడలకు ఉరితీశారు. జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యిమందికి పైగా కాల్చి చంపిన ఘటన కన్నా 50 ఏళ్లకు ముందే నిర్మల్ లో ఆఘటన జరిగిందని చెప్పవచ్చు. అలా నిర్మల్‌లో ఒకేసారి వెయ్యి మంది ప్రాణాలు గాల్లోకలిశాయి.
గోదావరి తీరంలో దట్టమైన అడవులు, గుట్టలున్న నిర్మల్ నే తన కేంద్రంగా చేసుకుని రాంజీ గోండుబ్రిటీష్ వాళ్లపై పోరాటం సాగించాడు. స్థానిక ప్రజలకు సైనిక శిక్షణ కూడా ఇచ్చేవారు. రైతుల నుంచి బలవంతపు వసూళ్లను నిలిపి వేయించారు. దీంతో వీరిని దెబ్బతీయటానికి… నిజాం ప్రభువు బ్రిటిష్ సేనల సహకారం కోరాడు. అలా రాంజీ సహా, వెయ్యిమందిని బంధించి బలితీసుకున్నారు.
రాంజీ గోండు చరిత్రకెక్కని వీరుడు. తన అనుచరణగణంతో బ్రిటీష్-నిజాం సైన్యంతో పోరుసాగించిన యోధుడు. తరువాతి కాలంలో జల్, జంగల్ , జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమ్రం భీంకు స్ఫూర్తిగా నిలిచాడు. అయినా రాంజీ చరిత్ర పాఠ్యాంశాల్లోకి ఎక్కలేదు. ఇక వెయ్యిమంది బలిదానానికి సాక్షీభూతమైన ఆ మర్రి గాలివానకు 1996లో నేలకొరిగింది.ఆ ప్రాంతాన్నే కేంద్రహోంమంత్రి సందర్శించనున్నారు. అక్కడున్న స్తూపానికి, రాంజీగోండు విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు.