ఇసుక అక్రమ తవ్వకాల కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హనీని నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ అతన్ని సీబీఐ కోర్టులో హాజరుపరచనుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఈ అరెస్ట్ జరిగింది.
అరెస్ట్ పై సీఎం స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని… తమకు ఈ అరెస్ట్ పై ఎలాంటి అభ్యంతరం లేదనీ అన్నారు.
గత నెలలో హనీకి సంబంధించిన ఇసుక అక్రమ తవ్వకాలపై జరిగిన దాడిలో దర్యాప్తు సంస్థ 8 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఆస్తుల లావాదేవీలు, మొబైల్ ఫోన్లు, 21 లక్షలకు పైగా విలువైన బంగారం, 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంధువులపై దాడులు జరిగాయని, అదేవిధంగా తనపై, ఆయన మంత్రులపై ఒత్తిడి తెచ్చేందుకు ఈడీ అదే పద్ధతి అనుసరిస్తోందని చన్నీ విలేకరులతో అన్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నామని, కేసుతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు.
ఇండియన్ పీనల్ కోడ్, మైన్స్ & మినరల్స్ యాక్ట్, 1957 ద్వారా షహీద్ భగత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో 2018 ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు విచారణ జరుగుతుంది.