ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలపై దేశ వ్యాప్త చర్చ నడుస్తుండడంతో పంజాబ్ సర్కారు ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం….సిద్ధార్థ చటోపాధ్యాయ స్థానంలో వీరేష్ భవ్రాను కొత్త డీజీపీగా నియమించింది. మూడురోజుల క్రితం ప్రధాని పర్యటనలో బయటపడిన భద్రతాలోపం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దానివెనక ఉగ్ర కుట్ర ఉందనీ బీజేపీ సందేహాలు వ్యక్తం చేసింది.
ఓవైపు బీజేపీ, మరోవైపు సుప్రీంకోర్టు నిలదీయడం,రాష్ట్రపతి సైతం ఆందోళన వ్యక్తం చేయడంతో …చన్నీ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సమర్పించాలని ఆదేశించింది.
పర్యటన రద్దు చేసుకుని తిరిగి వెళ్తూ “ప్రాణాలతో వెళుతున్నా,మీ సీఎంకు ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ లో ప్రధాని పోస్ట్ చేయడం ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీని ఇరకాటంలో పడవేసింది. దేశ సరిహద్దుకు 10 కిమీ దూరంలో ప్రధానికి భద్రతా కల్పించలేక పోవడంపై ఆరోజు నుంచే ఎన్నో అనుమానాలు. దర్యాప్తు కోసం అత్యున్నతస్థాయి కమిటీని వేసినా సుప్రీం ఆదేశంతో విచారణ తాత్కాలికంగా నిలిచిపోయింది. అధిష్టానంతో విభేదాల కారణంగా సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ చేసిన హెచ్చరికల్నీ గుర్తు చేస్తున్నారు పలువురు. నవజ్యోత్ సింగ్ కనుక పీసీసీ చీఫ్ అయితే భద్రతా పరిస్థితుల దృష్ట్యా ప్రమాదమని హెచ్చరించడం, ప్రధాని పర్యటనలో ఇలా జరగడం గురించి రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ పరిణామాల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టుతెలిసింది. ఇవాళే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవడంతో దానిగురించే చర్చ నడుస్తోంది.
పంజాబ్ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు…ప్రధానమంత్రి భద్రత దేశానికి సంబంధించిన అంశం అని పంజాబ్ పర్యటనలో భద్రతాలోపాలపై ట్విట్టర్ వేదిగ్గా ఆందోళన వ్యక్తం చేశారు.