శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులు పరమ పవిత్రంగా తీసుకుని వెళ్ళేది ఇరుముడి. ఇరుముడి లో అనేక పదార్థాలు వేసి గురుస్వామి గారు కట్టుకట్టి శిరస్సు మీద పెట్టాక భక్తులు శబరిమలై బయల్దేరుతారు. ఇరుముడిలో ఉంచే పదార్థాలలో కొన్ని మార్పులు తీసుకుని వస్తున్నారు.
ఇరుముడిలో అగరవత్తులు, కర్పూరం పెట్టవద్దని శబరిమలై దేవస్థానం సూచిస్తున్నది. ఆలయ పాలక మండళ్లకు, ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.
కర్పూరం, అగరబత్తీలు పూజా సామగ్రి అయినప్పటికీ, వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సన్నిదానంలో అగరబత్తీలు, కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు. దీంతో ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరకుల్లో ఎక్కువ భాగం వృథాగా ఉండిపోతున్నాయి. వీటిని పండితతవళంలోని దహనశాలకు తీసుకెళ్లి కాల్చుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేందుకే దేవస్వమ్ బోర్డు ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త ప్రతిపాదన కూడా శబరిమలై అర్చకులు నుంచి తీసుకొని వస్తున్నారు.
ఆలయ ప్రధాన అర్చకుడు(తంత్రి) రాజీవరు ఇరుముడికట్టులో అగరబత్తీలు, కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వామ్ బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. “పూర్వం భక్తులు కాలినడకన వచ్చినప్పుడు అన్నం, కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారు. ఇప్పుడు అన్ని చోట్లా ఆహారం దొరుకుతోంది. కాబట్టి ఇరుముడికట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం తెచ్చుకోండి. వాటిని శబరిమలలో సమర్పించవచ్చు” అని లేఖలో పేర్కొన్నారు.
శబరిమలై దర్శన విషయంలో ఆన్లైన్ బుకింగ్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని చెబుతున్నారు.
. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ కోసం భక్తుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా పాస్ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కాగా, స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పను రోజుకు 10,000 మంది దర్శనం చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70,000 మంది దర్శనం చేసుకోవచ్చు.
ఈ మార్పులు శబరిమల ఆలయ పవిత్రత కోసం మరియు భక్తుల సంరక్షణ కోసం అని దేవస్థానం బోర్డు చెబుతోంది.