ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు ఖాయం అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు అదే సూచిస్తున్నాయి. జనసేన ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే మంత్రి పదవి విషయం ఆలోచిస్తున్నాం అని ఆయన బాంబు పేల్చారు. ఇప్పటికే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రకటించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సస్పెన్స్ లో పెట్టడం ఉత్కంఠను పెంచుతోంది.
…
దీనికి మరో కారణం చెబుతున్నారు. ఇప్పటికే జనసేన కు ఉన్న ముగ్గురు మంత్రులకు సంబంధించి మంత్రిత్వ శాఖల విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా హోం శాఖ నుంచి వంగలపూడి అనిత ను తప్పించాలి అన్నది జనసేన డిమాండ్. ఇప్పటికే హోమ్ శాఖ కావాలని పవన్ కళ్యాణ్ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. హోమ్ మంత్రి కోసం ఆయన బలంగా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చంద్రబాబు, లోకేష్ సుముఖంగా ఉన్నప్పటికీ, కొందరు తెలుగుదేశం నాయకులు అడ్డు పడుతున్నట్లు సమాచారం. హోమ్ శాఖను పవన్ కళ్యాణ్ కు ఇస్తే జనసేన గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుందని తెలుగు తమ్ముళ్లు బెంగ పడుతున్నారు.
..
అలాగే ప్రస్తుత మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేపడుతున్నారు. ఒకరు ఇద్దరు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గంలో గుబులు చెలరేగుతోంది. పనితీరు బాగోలేని ఒకరు ఇద్దరికి చెక్ పెట్టాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. దీనికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరి స్థానంలోనూ నాగబాబు, మరియు ఒక బీసీ నాయకుడిని మంత్రిమండలి లోకి తీసుకొనే ఛాన్స్ ఉంది.
…
నాగబాబుకి మంత్రి పదవి కావాలని చెబుతూనే, తమకు బలమైన శాఖలు కేటాయించాలి అని జనసేనాని పట్టు బడుతున్నట్లు సమాచారం. అందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశాలు కూడా తక్కువే. ఇప్పటికే వివిధ మంత్రిత్వ శాఖల్లో పవన్ కళ్యాణ్ చేతులు పెట్టేస్తున్నారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి హోదాలో జిల్లాల పర్యటన కూడా పెట్టుకొన్నారు. జనసేన పార్టీ పటిష్టత కోసమే ఈ పర్యటన అని ఆయన కుండబద్దలు కొట్టేసి మరీ చెప్పేస్తున్నారు. అటువంటప్పుడు జనసేన బలపడే ఛాన్స్ ను తెలుగుదేశం ఎంత వరకు ఇస్తుంది అనేది ప్రశ్న.