కర్ణాటకలో అధికార మార్పిడి తథ్యం అని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను దింపేయాలని కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి వర్గాలు పాములు కదుపుతున్నాయి. అప్పట్లో ఊహించని విధంగా ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్న సిద్ధరామయ్యకు పరిపాలన మీద పట్టు దొరకడం లేదు అధికార యంత్రాంగం మరియు పార్టీ యంత్రాంగం కూడా పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ చేతిలోనే నడుస్తున్నాయి మరోవైపు సిద్ధ రామయ్య మీద అవినీతి ఆరోపణలు వెల్లువెట్టడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను దింపేసినట్లయితే ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో డీకే పాత్ర చాలా కీలకము. ఇక్కడ మరో విషయం కూడా గమనించుకోవాలి. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ చాలా సన్నిహితులు. అందుచేత కర్ణాటకలో ముఖ్యమంత్రి జరిగినట్లయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా దాని ప్రభావం కనిపించవచ్చు.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో అధికారం దక్కిన వెంటనే డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తారు అని అంతా అనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం డీకే దూకుడు కి అదుపు చేసేందుకు గాను కొత్త నిర్ణయం తీసుకుంది సీఎంగా సిద్ధరామయ్యకు అవకాశం కల్పించింది. కానీ అప్పటినుంచి సిద్ధరామయ్య వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూ వస్తున్నారు.
ముడా భూములు, వాల్మీకి కార్పొరేషన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఇలా వరుస స్కామ్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు . విసిగిపోయిన సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై అధిష్ఠానం బుజ్జగింపులకు ప్రయత్నించినా.. సిద్ధరామయ్య తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నది. వెరసి కర్ణాటకలో సీఎం మార్పు త్వరలోనే జరుగనున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన మార్కు రాజకీయానికి తెర తీశారు. కాంగ్రెస్ అధిష్టానం లో ఎవరిని పట్టుకుంటే పని జరుగుతుంది అనేది ఆయనకు బాగా తెలుసు అందుచేత ఒకవైపు ఢిల్లీలో పావులు కదుపుతూనే మరోవైపు బెంగుళూరులో మంత్రాంగం నడిపిస్తున్నారు.
తాజాగా సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళితో వరుసగా సమావేశాలు జరుపుతున్నారు. వివిధ వర్గాల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ, సిద్ధరామయ్య తప్పుకుంటే, సీఎం పదవిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా మంత్రి జీ పరమేశ్వరకు కట్టబెట్టాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మల్లికార్జున కరిగే బిజీగా ఉన్నారు. అందుచేత ఆయన తిరిగి బెంగళూరుకి వచ్చే అవకాశాలు తక్కువ అని తెలుస్తోంది. మరోవైపు మాజీ పిసిసి అధ్యక్షుడు పరమేశ్వర పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఆయనకి కూడా రాయలసీమలోని తెలుగు కాంగ్రెస్ నేతలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి.
ఈ పరిణామాల్ని గమనిస్తున్న డీకే శివకుమార్ చక చక పావులు కదుపుతున్నారు అన్ని వైపుల నుంచి మద్దతు తనకే ఉండేటట్లుగా ఆయన చూసుకుంటున్నారు. అందుకే సీనియర్ మంత్రి జార్కిహోళిని కలిశారు. ఒకవేళ, సీఎంగా తనను ప్రతిపాదించి మద్దతు ప్రకటిస్తే, కేపీసీసీ అధ్యక్ష పదవి వచ్చేలా తాను అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని జార్కిహోళికి డీకే ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది.
జార్కిహోళికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. కాబట్టే, జార్కిహోళిని డీకే కలిసినట్టు చెప్తున్నారు.
ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది.జార్కిహోళి వాల్మీకి(ఎస్టీ) వర్గానికి చెందిన బలమైన నేత. అధిష్ఠానం తనను సీఎంగా చేస్తుందన్న ఆకాంక్ష ఈయనలో ఉన్నది. గత నవంబర్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘దళితులతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ నేత సీఎం అవ్వాలని కోరుకొంటున్నారు.ఆ మేరకు డిమాండ్లు ఉన్నాయి. అయితే దానిపై పార్టీ హైకమాండే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాల్మీకి గురుపీఠ స్వామీజీ ప్రసన్నానంద నన్ను సీఎంగా చూడాలనుకొంటున్నట్టు పేర్కొన్న విషయం మీకు తెలిసిందే’ అని సీఎం పదవిపై తన ఆసక్తిని జార్కిహోళి పరోక్షంగా తెలియజేశారు. డీకే తీరుపై జార్కిహోళి గత కొంత కాలంగా అసంతృప్తితోనూ ఉన్నారు. ఈ క్రమంలోనే తనను సీఎం చేయడానికి మద్దతు ఇవ్వాలన్న డీకే అభ్యర్థనను జార్కిహోళి తిరస్కరించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూన్నాయి. సిద్ధ రామయ్య స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్లయితే దాని ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల మీద కూడా పడే అవకాశం ఉంది.