కొత్త మహిళా మంత్రులు వీళ్లే..
కేంద్ర కేబినెట్ విస్తరణలో మరికొందరు మహిళలకు అవకాశం దక్కింది. కొత్తగా ఏకంగా ఏడుగురికి మోదీ టీంలో చోటు లభించింది. కేబినెట్ విస్తరణలో అవకాశం దక్కించుకున్న మహిళలు ఎవరంటే…
మీనాక్షి లేఖి :
ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపి నాయకురాలు మీనాక్షి లేఖి. న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా అందరికీ సుపరిచితురాలైన మీనాక్షి లేఖి బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా చాలాఏళ్లుగా పనిచేశారు.
జాతీయ మహిళా కమిషన్, బాలలు, మహిళల హక్కుల పరిరక్షణకు ఆమె కృషి చేశారు.
శోభ కరంద్లాజే :
శోభ కరంద్లాజే కర్ణాటకలోని ఉడుపి చిక్మగళూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా శోభ కరంద్లాజే గుర్తింపు తెచ్చుకున్నారు.
అన్నపూర్ణ దేవి :
అన్నపూర్ణ దేవి జార్ఖండ్‌లోని కొడెర్మా లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. 2019 నుంచి మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో అన్నపూర్ణా దేవి సభ్యురాలు.
అనుప్రియ సింగ్ పటేల్ :
అనుప్రియ పటేల్ ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్ (ఎస్) పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అప్నా దళ్ పార్టీ స్థాపకుడు, బహుజన్ సమాజ్ పార్టీకి సహ వ్యవస్థాపకుడు అయిన దివంగత నేత డాక్టర్ సోనే లాల్ పటేల్ కుమార్తె అనుప్రియ. తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకుంటూ కేంద్రమంత్రి అయ్యారు.
డా భారతి ప్రవీణ్ పవార్ :
మహారాష్ట్రలోని డిండోరి (ఎస్టీ) నియోజకవర్గం నుంచి ఎంపీ భారతీ ప్రవీణ్ ప్రవార్.
నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూవర్షిప్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
ప్రతిమ భౌమిక్ :
ప్రతిమ భౌమిక్ త్రిపుర (తూర్పు) లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. రైల్వే మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా ప్రతిమ భౌమిక్ సేవలు అందిస్తున్నారు.
దర్శన విక్రమ్ జర్దోశ్ :
సూరత్ ఎంపీ దర్శన విక్రమ్ జర్దోశ్. 2019 నుంచి ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగానూ సేవలు అందిస్తున్నారు.