భారతీయ సమాజం ఔన్నత్యం కోసం పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మీద అనవసరంగా కొనసాగుతున్న నిషేధం ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కుంటి సాకులతో 60 ఏళ్ల క్రితం విధించిన ఈ ఉత్తర్వులు సరి కాదని కేంద్రం నిర్ధారణ చేసింది. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
1925 లో ఏర్పాటు అయిన ఆర్ఎస్ఎస్ దేశ స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకుంది. దేశ పునర్ నిర్మాణం కోసం పాటుపడుతున్న సంఘ్ మీద అప్పట్లోనే కొన్ని శక్తులు పగ పట్టాయి. మహాత్మా గాంధీ మరణం అనంతరం ఆర్ఎస్ఎస్పై 1948లో నాటి జవహర్ లాల్ నెహ్రు ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ నిషేధాన్ని ఆ తర్వాత తొలిగించారు. కానీ ఆ తర్వాత కూడా కుట్రలు కొనసాగాయి.
1966లో కొన్ని కుంటి సాకులు చూపిస్తూ..
ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గోకూడదు అని నిషేధం విధించారు. అది కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్‌కి వ్యతిరేకమని ఉత్తరువులు జారీచేశారు. 58ఏళ్ల పాటు ఉన్న అరాచకంగా కొనసాగిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తివేసింది.
దీనిమీద దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం సముచితమైనదని, భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం, సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై ఉందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, ఐక్యత-సమగ్రత , ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఆర్ఎస్ఎస్ చేసిన కృషి కారణంగా, దేశంలోని వివిధ రకాల నాయకత్వం ఎప్పటికప్పుడు ఆర్ఎస్ఎస్ పాత్రను కొనియాడుతోందని ఆయన గుర్తు చేశారు. తమ రాజకీయ స్వప్రయోజనాల కారణంగా అప్పటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను అన్యాయంగా నిషేధించిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
అనేక ప్రజా సంఘాలు జాతీయ వాద సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించాయి. ఆర్ఎస్ఎస్ మీద అనవసరంగా ఇంత కాలం పాటు నిషేధం కొనసాగించారని అభిప్రాయపడ్డాయి.