ఆంధ్రప్రదేశ్ సమాజానికి కేంద్రం తీపి కబురు అందించింది. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చొరవ చూపిస్తోంది. ఏపీ లోని తెలుగు దేశం కూటమి ప్రయత్నాలకు అండగా నిలుస్తోంది.
తాజాగా అమరావతి ప్రాంతానికి రైలు సౌకర్యం తీసుకుని వస్తోంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.
అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాకు అనుసంధానిస్తూ కొత్త లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో మధ్య, ఉత్తర భారతంతో దక్షిణ భారతదేశం అనుసంధానం మరింత సులువుకానుంది. అమరలింగేశ్వర స్వామి, అమరావతి స్తూపం, ధ్యాన బుద్ధ, ఉండవల్లి గుహల గుండా రైల్వే మార్గం ఉండనుంది.
🛤️New rail line project for Amaravati providing direct connectivity to major metro cities
🌉New rail bridge over Krishna RiverTotal length: 57 km
Total Cost: Rs 2,245 Cr#CabinetDecisions pic.twitter.com/U1ek33vroy— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 24, 2024
దీంతో అమరావతి కి మాత్రమే కాకుండా ఏపీ సమాజానికి ప్రయోజనం కలుగుతుంది.
మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం కొనసాగనుంది. ఈ లైన్ నిర్మాణం ద్వారా కూలీలకు 19 లక్షల పనిదినాలు ఉపాధి కల్పన జరగనుంది. పర్యావరణానికి హాని కలుగకుండా ఉండేందుకు 25 లక్షల చెట్లు నాటాలని నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన బ్రిడ్జ్ నిర్మాణం సాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో గల ఖమం జిల్లా, ఏపీలో ఎన్టిఆర్ విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కొత్త రైల్వే లైన్ నిర్మాణం సాగనుంది. అమరావతి, బీహార్‌కు సంబంధించి రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 6,789 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదించింది.
దీనికి సంబంధించిన వివరాలు కేంద్రం వెల్లడించింది.
ఏపీ రాజధాని అనుసంధానానికి 57 కి.మీ, బీహార్‌లో 256 కి.మీ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త లైన్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని అమరావతికి ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. పరిశ్రమలు నెలకొల్పడానికి, ప్రజా రవాణాకు ఉపయోగపడనుందని వివరించారు. దీంతో రద్దీని తగ్గిస్తుందని తెలిపారు.
గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయించారు. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలో పనులు ప్రారంభమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేపట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఇక్కడ మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి.
గతంలో రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్‌ను ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు కావడంతో ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. . ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది.
ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్ ఎర్రుపాలెం – నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి – పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి – నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్ ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. తర్వాత బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం అవడంతో అమరావతి రైలుమార్గానికి నిధులు కేటాయించారు. నిర్మాణంలో ఉన్న నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్ ఫండ్ కింద రూ.250 కోట్లు, కేపిటల్ ఫండ్ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చొరవ తో మంచి రోజులు రాబోతున్నాయి.