భారతీయ సమాజంలో మహిళలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ ఒకటి. గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి మహిళలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యల పట్ల అవగాహన కల్పించేందుకు స్వప్నిక రేహా ఫౌండేషన్.. హైదరాబాద్ లోని ప్రభుత్వ యోగా నేచర్ క్యూర్ హాస్పిటల్ లో శిబిరం నిర్వహించింది.
ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు మహాలక్ష్మి ప్రారంభించి.. ఫౌండేషన్ చేస్తున్న వివిధ సేవ కార్యక్రమాలు గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలలో వచ్చే క్యాన్సర్ లో గురించి అవగాహన కల్పించారు. క్యాన్సర్‌పై అపోహలు, భయాల నుండి బయటపడేందుకు క్యాన్సర్ రోగులకు మొదటి దశలో గుర్తింపు మరియు సహకారం కల్పించడం ముఖ్యమని వివరించారు. క్యాన్సర్ చికిత్సలో ఉన్నవారికి వైద్య సహాయం, భావోద్వేగ పరమైన మద్దతు అవసరమని, ఆప్యాయతతో వారిని ఆదుకోవాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. కె. జ్యోతిర్మయి , అభయం ఫౌండేషన్ సమన్వయకర్త గాయత్రి సుసర్ల, సామాజిక కార్యకర్త కొండల్ రావు మాట్లాడారు.
డాక్టర్ జ్యోతిర్మయి తన ప్రసంగంలో మహిళల ఆరోగ్యంపై శారీరక, భావోద్వేగ అంశాలను చర్చిస్తూ. , ఈ రెండు అంశాలు పరస్పర అనుబంధంగా ఉన్నాయని వివరించారు. హార్మోన్ల మార్పులు సహజమైనప్పటికీ, ఇవి కొన్నిసార్లు మానసిక సమస్యలను కలిగిస్తాయి. కుటుంబ మరియు స్నేహితుల మద్దతు ఎంత కీలకమో వివరించారు. సంతానోత్పత్తి దశలో ఎదురయ్యే మార్పుల గురించి అవగాహన కలిగించడం ఎంత అవసరమో వివరించారు. గర్భధారణ మరియు ప్రసవం దశల్లో మార్పులకు కుటుంబం మద్దతుగా ఉండడం అవసరమని వివరించారు.
అభయం ఫౌండేషన్ సమన్వయకర్త గాయత్రి తన అనుభవాలను పంచుకుంటూ, ఆరోగ్య పరీక్షలు ఎంతో ముఖ్యమని చెప్పారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆమె తన జీవితంలో వచ్చిన అవరోధాలను వివరిస్తూ అక్కడికి వచ్చిన కాన్సర్ పేషెంట్స్ లో ఆశను చిగురించారు. రొమ్ము కాన్సర్, గర్భాశయముఖద్వార క్యాన్సర్ల గురించి అవగాహన కల్పించారు. హెచ్ పీ వీ వాక్సిన్ గురించి వివరించారు.
సామాజిక కార్యకర్త కొండల్ రావు పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ మన దైనందిన జీవితంలో ఆహారము యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా రోగాలను నిరోధించవచ్చని తెలియజేశారు.
ఈ ప్రసంగాల అనంతరం ప్రశ్నోత్తర సమావేశం నిర్వహించారు . డా. జ్యోతిర్మయి, గాయత్రి, మహాలక్ష్మి, మరియు కొండల్ రావు పాల్గొని, సందేహాలను నివృత్తి చేసారు. చివరగా ప్రాణాయామ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ సాయిరామ్ మాట్లాడుతూ .. ప్రాణాయామం, యోగ ప్రతి ఒక్కరు తమ దినచర్యలో భాగంగా చేసుకోవడం వలన ఎన్నో శారీరక, మానసిక రుగ్మతలు నుంచి విముక్తి పొందవచ్చు అని తెలిపారు.