అసోం ముఖ్యమంత్రి కాన్వాయ్ ని ఆరు కార్లకు పరిమితం చేస్తూ ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గువాహటిలో ఆరు, ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో పర్యటించేటపుడు ఎస్కార్ట్ సహా 12 కార్లు ఉండాలని నిర్ణయించింది.
సీఎం కాన్వాయ్ కంటే అంబులెన్స్‌లకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని, సీఎం కాన్వాయ్ కోసం అంబులెన్సు ఆపకూడదని మంత్రివర్గం నిర్ణయించింది.
సీఎం రోడ్డు ప్రయాణంలో ముందుగా ట్రాఫిక్‌కు అంతరాయంలేకుండా చూడాలని.. అవసరమైతే రెండు నిమిషాలకు మించకుండా ఆపవచ్చనీ నిర్ణయించింది.
“ప్రజల అసౌకర్యం కలిగించవద్దని సిఎం కాన్వాయ్ తగ్గిస్తున్నాం. సిఎం ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌ను ఎక్కువసేపు నిలిపివేయవద్దనీ నిర్ణయించాం ” అని హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేశారు.
ఇటీవలి ఎస్పీల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏదైనా జిల్లాలో భద్రత లేకుండా పర్యటించగలిగితే, ప్రజలను స్వేచ్ఛగా కలవగలిగితే అది తనకు విశేషం, ఆనందం. నా చుట్టూ అంత పెద్దఎత్తున భద్రతా బలగాలు ఉన్నాయంటే శాంతి భద్రతలు బాగాలేవని అర్థం ఆని ఆయన అన్నారు.
ఇక మరో కీలక నిర్ణయమూ తీసుకుంది మంత్రివర్గం. ఇక ఏ అధికారిక కార్యక్రమం జరిగినా సీఎం, మంత్రులు, సీనియర్ అధికారులకు సన్మానాలు, బహుమతుల ప్రదానం నిలిపేయనున్నారు. అయితే ప్రముఖులకు మాత్రం తగిన మర్యాదలుంటాయి.