యావత్ హైందవలోకానికి గర్వకారణంగా నిలుస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధాన ఆలయం ఇప్పటికే భక్తుల దర్శనం కోసం అందుబాటులోకి వచ్చింది. మొత్తం ఆలయం నిర్మాణం పూర్తి కావడానికి మరో ఏడాది పట్టొచ్చు.
ప్రస్తుతం ప్రధాన ఆలయం ఉన్నచోట పనులు వేగవంతం చేశారు. రామమందిరం మొదటి అంతస్తు నిర్మాణం 90 శాతం పూర్తయ్యింది. వచ్చే జూలై నాటికి తొలి అంతస్తు పూర్తిగా సిద్ధమవుతుంది. మొదటి అంతస్తులో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. 2025 మార్చి నాటికి ప్రాకారంతో సహా మంది నిర్మాణం పూర్తవుతుంది.
ఆ తర్వాత తొలి అంతస్తులో రామ్ దర్బార్ విగ్రహాలను పాలరాతితో తయారు చేయనున్నారు.
ఇందుకోసం రాజస్థాన్‌కు చెందిన నలుగురు శిల్పులతో చర్చలు జరిపారు.. టెండర్ ప్రక్రియ సైతం జారీ చేశారు. నెలాఖరులోగా టెండర్లు తెరుస్తున్నారు. విగ్రహ తయారీకి శిల్పిని ఎంపిక చేస్తారు.
గర్భాలయంలో కొలువుదీరిన రామ్‌లల్లాను దర్శించు కునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిత్యం లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల మందికి పైగా దర్శనం చేసుకున్నారు.
మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయోధ్యకు భక్తులు వెళుతున్నారు. ఆలయంలోకి ప్రవేశించాక విస్తారమైన ఏర్పాట్లు చేయడంతో ఒకటి రెండు గంటల్లోనే దర్శనం పూర్తి చేసుకుని ప్రశాంతంగా బయటికి రాగలుగుతున్నారు.