దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్(రిటైర్డ్) విజయ్ రావత్ బీజేపీలో చేరారు. అంతకుముందు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిసిన కల్నల్ రావత్….పార్టీ రాష్ట్ర చీఫ్ మదన్ కౌశిక్ సమక్షంలో ఢిల్లీ కార్యాలయంలో కమలదళంలో చేరిపోయారు. 34 ఏళ్లపాటు ఆర్మీలో వివిధ హోదాల్లో రావత్ పని చేశారు. వారి కుటుంబం మూడు తరాలుగా సైన్యంలో సేవలందిస్తూ వచ్చింది. గత నెలలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన సోదరుడు, తొలి సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
విజయ్, బిపిన్ ల తండ్రి జనరల్ లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా ఆర్మీ నుంచి రిటైరయ్యాక బీజేపీలో చేరారు. ఇప్పుడు పార్టీకి సేవ చేసే అవకాశం తనకు వచ్చిందని ఆయన అన్నారు. దేశం పట్ల ప్రధాని మోదీ గొప్ప దార్శనికుడని….ఉత్తరాఖండ్ కోసం ఆయన రూపొందించిన ప్రణాళిక అద్భుతమని విజయ్ కొనియాడారు.
మాజీ సైనికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సీఎం అభ్యర్థిగా కల్నల్ (రిటైర్డ్) అజయ్ కొథియాల్ ను ప్రకటించింది. మాజీ సైనికులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చింది.