అగస్త్య మహర్షి ప్రతిష్టించిన మాచవరం క్షేత్రం… కోరిన కోర్కెలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. శ్రీ భద్రకాళీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారికి, అమ్మ వారికి క్రమం తప్పకుండా విశేష పూజలు నిర్వహిస్తారు. హస్త నక్షత్రం లో జన్మించిన వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి పూజలు చేసుకోవాలని అగస్త్య మహర్షి సూచించినట్లు పండితులు చెబుతారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులంతా తరలిరావటంతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. సాంప్రదాయం ప్రకారం వినాయక పూజ, పంచగవ్యం, ధ్వజారోహణం నిర్వహించారు. సంగీత స్వరాలతో చేపట్టిన భేరీ పూజ అందరినీ ఆకట్టుకొంది. అనంతరం స్వామి వారు, అమ్మ వార్లను వార్షిక కళ్యాణం నిర్వహించారు. రెండు వైపులా ఉండే గోత్రాలు, ప్రవరలు తెలియపరిచి సాంప్రదాయ బద్దంగా ఉత్సవం చేపట్టారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచిపెట్టారు.