దక్షిణ తెలంగాణా లో ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మం గారి గుట్ట కు వక్ఫ్ బోర్డు రూపంలో గ్రహణం పట్టింది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నాయకులు, అధికారులు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కావటం లేదు. వక్ఫ్ బోర్డు పంజా కు అక్కడ ప్రజలు అంతా అల్లాడిపోతున్నారు.
జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణంలో ఇది చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే
బ్రహ్మంగారి గుట్టపై వెలసిన పురాతన దుర్గాదేవీ ఆలయానికి, బ్రహ్మంగారి మఠానికి మధ్య ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.140 కోట్ల తో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత జిల్లా కావడంతో.. నిర్మాణ పనులు శరవేగంగా మొదలయ్యాయి. శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. టెండర్ల ప్రకటన కూడా చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 6 న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అంతే.. సీన్ లోకి వక్ఫ్ బోర్డ్ ఎంటర్ అయ్యింది. ఆ ప్రాంతం తమదంటూ వాదనలకు దిగింది. రోడ్డు నిర్మాణం చేపడుతోన్న ఆ భూమి తమదని వాదించింది. అది వక్ఫ్ పరిధిలోని భూమి అని.. తమ అనుమతి లేకుండా టెండర్ల ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి NOC జారీ చేసేందుకు వక్ఫ్ బోర్డ్ సీఈవో నిరాకరించారు. దీంతో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నిరవధికంగా నిలిపెయ్యాల్సి వచ్చింది. వక్ఫ్ బోర్డు జోక్యం కారణంగా, ప్రతిష్టాత్మకమైన ఆలయ అభివృద్ధి పనులు అకస్మాత్తుగా ఆగిపోయినట్లయ్యింది.
ఈ పరిణామం తో అధికారులు చేతులు ఎత్తేశారు. దీని మీద జూలై 9, 2025 నాడు రోడ్లు, భవనాల శాఖకు వక్ఫ్ బోర్ట్ అధికారికంగా ఓ లేఖ రాసింది. అధికారుల అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయాలతో వక్ఫ్ ఆస్తులు కోల్పోతున్నాయని తెలిపింది. వక్ఫ్ చట్టం 1995 ప్రకారం.. ఆ భూమి వక్ఫ్ ఆస్తి అని పేర్కొంది. స్పష్టమైన అనుమతి లేకుండా ప్రజా అవసరాలకు దానిని ఉపయోగించరాదని లేఖలో స్పష్టం చేసింది. ఒకవేళ ఘాట్ రోడ్డు వేయాలంటే ముందుగా వక్ఫ్ అనుమతి తీసుకోవాలని.. అలాగే రోడ్డు వల్ల నష్టపోతున్న భూమికి సరిపడా.. వక్ఫ్ బోర్డు వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సదరు లేఖలో పేర్కొంది.
ఇక్కడ మరో మెలిక కూడా పెట్టేశారు.
వాస్తవానికి ఆలయాలు కొలువైన ఆ గుట్టకు బ్రహ్మంగారి గుట్టగా దశాబ్దాల నుంచి పేరు ఉంది. అయితే వక్ఫ్ రికార్డుల్లో మాత్రం.. ఆ గుట్టను లతీఫ్ సాహెబ్ గుట్టగా పేర్కొన్నారు. అంతేకాదు.. అది వక్ఫ్ రికార్డుల్లో నమోదై ఉంది. అందుకే ఆ గుట్టపై ఎలాంటి నిర్మాణ పనులు చేయాలన్నా.. వక్ఫ్ అనుమతి ఉండాల్సిందే అని బోర్డు సభ్యులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబందించి.. నల్గొండ జిల్లాకు చెందిన ముస్లీం మైనార్టీ నాయకులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో ఇస్లామిక్ మత నాయకుడు మౌలానా ఎహ్సానుద్దీన్, నల్గొండ జిల్లా మజ్లీస్ అధ్యక్షుడు రజియోద్దీన్, స్థానిక కమ్యూనిటీ నాయకుడు MA హఫీజ్ ఖాన్, లాయర్ మసూద్ అలీ, స్థానిక ప్రతినిధి సయ్యద్ ఇబ్రహీం ఇంకా జిలానీ హాజరయ్యారు. ఘాట్ రోడ్డు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మొత్తం మీద వక్ఫ్ బోర్డు కన్ను పడటం తో విలువైన భూమి కబ్జా అయిపోతుంది. బ్రహ్మం గారు గుట్ట అభివృద్ధి నిలిచి పోయింది.