తెలంగాణలో ధాన్యం కొనుగోలు మంటలు రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన ధాన్యం కొనుగోలు వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ శాసనసభ పక్షం అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ స్కాం వివరాలు బయటపెట్టారు. కుంటి సాకులు చెప్పి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారని ఆయన వెల్లడించారు. మిల్లర్లు సిండికేట్లతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు అయిందని అందువల్లనే రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మరో అడుగు ముందుకేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించి స్కాం జరిగిన తీరుని పూర్తి వివరాలతో సహా బయటపెట్టారు. దీని నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతోంది. చివరకు పౌరసరఫరాల మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
వాస్తవానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజులు అవుతోంది . ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి జరుగుతున్న నాటకాలను ఆయన బయటపెట్టారు. రైతులను ఏ రకంగా దోచుకొంటున్నదీ స్పష్టంగా వివరించారు. తాలు, తేమ పేరుతో బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆయన విమర్శించారు. కాంటా చేసిన ధాన్యానికి రసీదు ఇవ్వకపోగా, మిల్లులకు తరలించిన ధాన్యానికీ రైస్ మిల్లర్లు 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిజెపి వెలిగించిన మంట నెమ్మదిగా రాజుకుంది. బీఆర్ఎస్ , బిజెపి నేతలు ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ప్రెస్ మీట్ పెట్టారు. లెక్కలతో సహా స్కాం జరిగిన తీరును వెల్లడి చేశారు.
రూ.1,100 కోట్ల వ్యవహారం కు సంబంధించి జనవరి 25న కమిటీ వేసి, అదే రోజు మార్గదర్శకా లు విడుదల చేసి, అదే రోజున కాంగ్రెస్ ప్రభు త్వం టెండర్లను పిలిచిందని కేటీఆర్ తెలిపా రు. బీఆర్ఎస్ హయాంలో సేకరించిన రూ.7 వేల కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వలపై కాంగ్రెస్ ప్రభు త్వం కన్నేసిందని, 35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు స్కాం జరిగిందని, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం కొనుగోలు కోసం రూ.300 కోట్లకు రెండో కుంభకోణం జరిగిందని వివరించారు. ధాన్యానికి క్వింటాలకు రూ.2,100 చొప్పున స్థానిక మిల్లర్లు కొంటామని చెప్పినా.. వారికి ఇవ్వకుండా నిబంధనలో మార్పులుచేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపారని వెల్లడించారు. ఈ టెండర్లను కేంద్రియ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ సంస్థలు దకించుకున్నాయని తెలిపారు. ధాన్యం సిండికేట్ ల కోసం కాంగ్రెస్ పెద్దలు శక్తివంచన లేకుండా పనిచేశారని కేటీఆర్ అంటున్నారు . ఈ విషయంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని , ఢిల్లీ పెద్దలకు కూడా పాటలు పంపించారని ఆయన మండిపడుతున్నారు.
దీంతో తెలంగాణ అంతట ధాన్యం కొనుగోలు వ్యవహారం కార్చిచ్చు లా రగులుతోంది
దీని మీద రైతాంగంలో అసంతృప్తి పెరుగుతోంది అన్న ఇంటలిజెన్స్ రిపోర్టులతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు.
ప్రతిపక్షాల ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పారు. తాలు, తరుగు పేరుతో రైతుల నుంచి లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘మహిళా సంఘాల ఆధ్వర్యంలో 7,200 కొనుగోలు కేంద్రాలు, మూడు వేల మిల్లులు ఉండగా తాము కమీషన్ తీసుకున్నామట. ఇందులో రూ.వెయ్యి కోట్లు నేను తీసుకున్నానట. రూ.100 కోట్లు ఎవరికో పంపిచ్చానట. ఇంతకన్నా పచ్చి అబద్ధం. దుర్మార్గమైన మాట లు మరోటి లేవు. వెంటనే ఈ ఆరోపణలను ఉపసంహరించుకోవాలి” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఎలా ఉన్నా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్కామ్ జరిగింది అన్న మాట తెలంగాణ సమాజంలో పూర్తిగా చర్చనీయాంశం అయింది. అటు రైతాంగాన్ని మిల్లర్లు దోచుకోవడం కూడా ఈ వాదాన్ని బలపరుస్తోంది.