హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. మూడోసారి గెలుపు సాధించడంతో కమలనాథులు పండగ చేసుకుంటున్నారు. అటు కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక సీట్లను సాధించింది. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.
హర్యానాలో బిజెపి గెలుపుకి అనేక అంశాలు కలిసి వచ్చాయి. సుపరిపాలనను గౌరవించండి అంటూ బిజెపి చేసిన ప్రచారం కలిసి వచ్చింది. రైతుల పోరాటం కొంప ముంచుతుంది అని భయపడినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపించలేదు. టికెట్లు పంపిణీ నుంచి ప్రచారం దాకా బిజెపి పెద్దలు పకడ్బందీగా వ్యవహరించారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ .. చేసిన తప్పులే చేస్తూ.. పప్పులో కాలేసింది. మొదట నుంచి ప్రచారంలో కాంగ్రెస్ గణనీయంగా వెనుకబడి. పోయింది. ఎన్నికల ప్రకటనకు ముందే బీజేపీ ఎన్నికల మూడ్‌లో ఉండగా, కాంగ్రెస్ నేతలు జాబితాల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. పార్టీ అగ్రనాయకత్వం కూడా కాస్త ఆలస్యంగా ప్రచారంలోకి దిగింది.
గ్రూప్ తగాదాలు కూడా కాంగ్రెస్ కొంప ముంచాయి. మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా, ఎంపీ కుమారి సెల్జా మధ్య వార్ నడుస్తుంది. సీఎం పదవికి తానే బలమైన పోటీదారు అని సెల్జా ప్రకటించారు. కాగా.. ఎన్నికల సమయంలో కుమారి సెల్జాపై భూపేంద్ర హుడా అనుచరుడు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో.. సెల్జా ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఓ సభలో రాహుల్ గాంధీ ఆమెను వేదికపైకి తీసుకొచ్చి హుడాతో కరచాలనం చేయించారు. అయినప్పటికీ వారి మధ్య గ్యాప్ ఉంది.
కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. కాంగ్రెస్‌పై భారీ ఖర్చుల అంశాన్ని బిజెపి లేవనెత్తింది. దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థులు కోటా ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని బహిరంగంగా ప్రకటనలు చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు సందేశాన్ని పంపింది.. బిజెపి ఈ సమస్యను క్యాష్ చేసుకుంది. మెరిట్ మిషన్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించలేకపోయింది. రెండవది.. రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల తరహాలో రాజ్యాంగం అంశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించారు, అయితే ఈ ఫార్ములా ఈసారి ప్రజలలో పనిచేయలేదు.
అటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ భారీగా సీట్లోను గెలుచుకుంది. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని బలంగా చెబుతూ బిజెపి కాంగ్రెస్ ఎన్‌సిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ క్రమంలో ఓటింగ్ పూర్తిగా హిందూ ముస్లిం వర్గాలుగా చీలిపోయింది. దీంతో ముస్లింల ఆధిపత్యం ఓటు బ్యాంక్ అంతా వన్ సైడ్ గా నడిచింది. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కి బాగా కలిసి వచ్చింది. బిజెపి పరువు దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయింది. కానీ ఎన్నికల ముందు పొత్తులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని పంచుకుంటుంది.