అటు గుజరాత్ లో భారీ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటోంది బీజేపీ. తాము చేసిన అభివృద్ధే మరోసారి అధికారాన్ని కట్టబెట్టిందంటున్నారు నేతలు. 1995 నుంచి బీజేపీనే అక్కడ గెలుస్తూ ప్రభుత్వాన్ని ఏలుతోంది.
1998 ఎన్నికల్లో 117 సీట్లు సాధించిన బీజేపీ ….2002లో మోదీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లి 127 సీట్లు పొందింది. ఇక 2007 లో మోదీ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్తే మళ్లీ 117 ఓట్లు కట్టబెట్టారు గుజరాత్ ఓటర్లు. 2012లో 115 స్థానాలు గెలుచుకోగా..కిందటి ఎన్నికల్లో అంటే 2017 ఎన్నికల్లో మాత్రం కేవలం 99 సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఇక తాజా ఎన్నికల్లో అన్ని రికార్డులను బద్దలుకొడుతూ ఏకంగా 156 సీట్లు గెలుచుకునేదిశగా జైత్రయాత్ర సాగిస్తోంది.
అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పాటీదార్ల మద్దతు కూడగట్టుకోవడం పార్టీ అఖండ విజయానికికారణంగా చెప్పవచ్చు. పాటీదార్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ… ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించింది. అంతేకాదు విజయ్ రూపానీని పక్కనపెట్టి పాటీదార్ వర్గానికి చెందిన భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది. రాష్ట్రంలో గణనీయ ఓటు బ్యాంక్ ఉన్న పాటీదార్లు కనీసం 40-50 సీట్లల్లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రభావం చూపగలరు. అటు ప్రత్యర్థి పార్టీలు బలంగా లేకపోవడం కూడా పార్టీ అద్భుత విజయానికి మరో కారణంగా చెప్పవచ్చు.