ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. మోదీకి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాగతం పలికారు. ప్రధానిని బీజేపీ నేతలు కూడా ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభువం తరపున ప్రధానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)కు చేరుకున్నారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి బయలుదేరి నోవాటెల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలతో సహా 360 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొనే సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు.
రేపు ఉదయం 10 గంటల నుంచి జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరుకానున్నారు. రాజకీయ అంశాలపై తీర్మానాలు సహా కీలక తీర్మానాలపై చర్చల సందర్భంగా ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటలకు కార్యవర్గం ముగిసే వరకు మోదీ హాజరవుతారు. అనంతరం ఆయన ఇతర నేతలతో కలిసి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని బీజేపీ తెలంగాణ విభాగం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
బహిరంగ సభ అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకుని.. జూలై 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం బయలుదేరి వెళతారు.