బిజెపి అధిష్టానం ఇప్పుడు తెలంగాణ మీద ఫోకస్ చేసింది. రాగల రోజుల్లో తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు సమగ్రమైన ప్రణాళిక తయారు చేసింది. మూడు సంవత్సరాల పాటు ఏ నెలలో ఏఏ పనులు చేయాలి అనేది ఒక రోడ్ మ్యాప్ ని రూపొందించుకోవడం జరిగింది.
హైదరాబాద్ శివారు శంషాబాద్ లో తెలంగాణ బిజెపి విస్తృత స్థాయి సమావేశం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విచ్చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటుగా పార్టీ జిల్లా మరియు మండల కార్యవర్గం నాయకులు విచ్చేశారు ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు ధర్మేంద్ర ప్రధాన్ అధిష్టానం సందేశాన్ని అందించారు వచ్చే మూడు సంవత్సరాలలో సమగ్రమైన ప్రణాళిక అమలు చేయాలని ఆయన సూచించారు.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్ లో భారతీయ జనతా పార్టీని మరింత బలపర్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. యువత, మహిళలు, రైతులు, పేదల శ్రేయస్సు అకుంఠిత పరిశ్రమతో, గొప్ప సంకల్పంతో పనిచేయాలని సూచించారు. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
పదేళ్లుగా తెలంగాణ ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూనే ఉందని చెబుతూ తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ విరోధిగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు.
తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అనేది పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే అని కేంద్ర మంత్రి చెప్పారు. దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీకి కొత్త శకం మొదలైందని చెబుతూ గతంలో బిజెపి ఉత్తర భారతదేశానికే పరిమితమని కొంత మంది విమర్శలు చేశారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల ద్వారా దేశ వ్యాప్తంగా బిజెపి ప్రాబల్యమేంటో వారికి అర్థమైందని తెలిపారు.
దక్షిణ భారతంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడిందని, కేరళ లో బిజెపి ఖాతా తెరిచిందని, తమిళనాడు లో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించామని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద సీట్లు దాటలేదని, 13 రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఖాతానే తెరవలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అయినా కాంగ్రెస్ నాయకుల తీరు మారలేదని, మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా నేతలు విరివిగా పాల్గొన్నారు పార్టీ అధిష్టానం ఇచ్చిన రోడ్ మ్యాప్ ను అమలు చేస్తామని నాయకులు చెబుతున్నారు.