తెలంగాణలో బిజెపిని పటిష్టం చేసేందుకు పార్టీ నాయకత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. నిరంతరాయంగా ప్రజల్లో పార్టీ క్యాడర్ను నిలపడమే దీనికి మార్గమని భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ అంశాల మీద దశల వారీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు.
తెలంగాణలో అలవి కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది అన్నది బిజెపి భావన. బాహుబలి రేంజ్ లో హామీలకు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందులో చాలా వరకు నెరవేర్చలేదు అని కమల నాథులు అంచనా వేస్తున్నారు. హామీలను కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తీరుని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లయితే ..పార్టీని పటిష్టం చేసుకోవచ్చని వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 30న అంటే సోమవారం రోజు రైతు దీక్ష చేపడుతున్నారు హైదరాబాద్ వేదికగా ఒక రోజంతా దీక్ష నిర్వహించనున్నారు.
ఈ దీక్షలో బీజేపీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని బీజేపీ మండిపడుతోంది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అంశాల మీద కాంగ్రెస్ సర్కారు దొంగాట ఆడుతోందని బిజెపి విమర్శలు గుప్పిస్తోంది.
రైతు రుణమాఫీ, రైతు భరోసా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేస్తోంది. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నేతలు అంటున్నారు. రైతు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 30న ఇందిరాపార్కు దగ్గర 24 గంటల దీక్ష బీజేపీ చేపట్టనుంది.
ప్రభుత్వం దిగివచ్చేదాకా ఈ అంశాల మీద దఫాలుగా ఆందోళనలు చేపట్టాలని బిజెపి భావిస్తోంది. ఫలితంగా ప్రజా పోరాటాలకు పదును పెట్టి పార్టీని పటిష్టం చేసుకోవాలని నాయకత్వం ఒక అంచనాకు వచ్చింది. రైతు దీక్ష విజయవంతమైనట్లయితే పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్ల వచ్చని కమల నాథులు లెక్కలు వేసుకుంటున్నారు.