కొన్ని దశాబ్దాలపాటు దేశరాజకీయాల్లో భారతీయ జనతాపార్టీ కీలక శక్తిగా నిలుస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ, విపక్షనేత రాహుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణకు కారణం ఏంటో..ఆయన బలమేంటో తెలుసుకుంటేనే ఆయన్ని ఓడించగలరని అన్నారు. మోదీ ఉన్నంతవరకే బీజేపీ బలంగా ఉంటుందన్నది భ్రమమాత్రమేనన్నారు. బీజేపీ గెలిచినా ఓడినా దేశ రాజకీయాలకు కేంద్రంగా మరో నలభైఏళ్లు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పీకే.
మోదీమీద ప్రజలు కోపంతో ఉన్నారని కాంగ్రెస్, రాహుల్ గాంధీ అనుకుంటున్నారని….అయితే మోదీని పంపిస్తారేమో కానీ…బీజేపీ మాత్రం ఎక్కడికీ వెళ్లబోదని అన్నారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు పార్టీలు…ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీతో పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. బీజేపీ ప్రభావం ఇంకో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పీకే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యల వీడియో… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.