బిజెపి వ్యతిరేక సర్వేల బాగోతం!
అదే ఎబిపి న్యూస్ చానల్. మళ్లీ సర్వే అనే విచిత్ర విన్యాసం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వండి వార్చిన గణాంకాలు. ఉత్తమ సీఎంల సర్వేలో మొదటి ఐదుగురిలో యోగి ఆదిత్యనాథ్ సహా బిజెపి ముఖ్యమంత్రులెవరికీ చోటు దక్కలేదు. అంత చక్కగా సర్వే చేశారన్న మాట. ఇప్పుడు ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో సర్వే పేరుతో మరో నాటకం మొదలుపెట్టారని అర్థమవుతుంది. ఎబిపి చానల్ ప్రతి ఎన్నికల సమయంలో బిజెపి బలాన్ని తక్కువ చేసి చూపిస్తూ సర్వే గణాంకాలను ప్రకటిస్తూ ఉంటుంది.
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందరి దృష్టీ బెంగాల్ పైనే ఉంది. మమతా బెనర్జీని రాజకీయంగా ఏకాకిని చేస్తూ ప్రతిపక్షాలు వీలైనన్ని ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. కాంగ్రెస-వామపక్షాలు జట్టు కట్టాయి. ఎంఐఎం ముస్లిం ఓటు బ్యాంకు విషయంలో తృణమూల్ కాంగ్రెస్ కు సవాల్ విసురుతోంది. అయినా, అక్కడ మమత పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనేది ఎబిపి-సి వోటర్ సర్వే సారాంశం అని ప్రకటించారు. మొత్తం 294 అసెంబ్లీ సీట్లున్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 158, బిజెపి 102, కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి 30 సీట్లు గెల్చుకుంటారంటూ సర్వే వంటకాన్ని వండి వార్చింది. సరే, ఎన్నికల ఫలితాలు వస్తే గానీ ఈ అంకెలు నిజమో కాదో తెలియదు.
తమిళనాడులో డిఎంకె-కాంగ్రెస్ కూటమి 162, బిజెపి-అన్నా డిఎంకె కూటమి 98 సీట్ల గెలుస్తాయట. జయలలిత మరణం తర్వాత తమిళనాట అన్నా డిఎంకె బలహీన పడిందని స్పష్టంగా కనపడుతోంది. అందుకు సర్వే అవసరం లేదు. ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదు. ఇక అస్సాంలో మరోసారి బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 126 సీట్లకు గాను గరిష్టంగా 81 సీట్లు గెలుస్తుందనేది ఈ సర్వే సారాంశం. కేరళలో మళ్లీ లెఫ్ట్ కూటమి గెలుస్తుందట. పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ కూటమిపై ఎన్డీయే స్వల్ప ఆధిక్యం సాధిస్తుందట.
మొత్తం మీద బెంగాల్ విషయంలో కమలనాథుల స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి ఈ అంకెలను విడుదల చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఎబిపి చానల్ ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే 233, యుపిఎ 167 సీట్లు గెలుస్తాయని ఎబిపి చానల్ సర్వే వంటకంలో తేల్చారు. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్ లో ఎన్డీయే 277, యుపిఎ 130 సీట్లు గెలుస్తాయంటూ మరో వంటకాన్ని వడ్డించారు. కానీ వాస్తవ ఫలితం ఏమిటో తెలుసు కదా. ఒక్క బిజెపినే సొంతంగా 303 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లు గెల్చుకుని మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితికి చేరింది. ఆ ఎన్నికల్లో మోడీ కరిష్మాకు సాటిరాగల ప్రతిపక్ష నేత ఎవరూ కనిపించలేదు. మళ్లీ మోడీదే హవా అని స్పష్టంగా కనిపించినా ఎబిపి చానల్ పనిగట్టుకుని కాంగ్రెస్ బలం బాగా పెరుగుతుందనే కలర్ ఇవ్వడానికి ప్రయత్నించింది. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ బిజెపి బలాన్ని తగ్గించి చూపడం అనేది ఎబిపి చానల్ జబ్బో లేక మరో మతలబు ఏమైనా ఉందో తెలియదు. సర్వే అంచనాలు 4-5 శాతం మించి తప్పుగా తేలితే ఆ సంస్థపై చర్యలు తీసుకునేలా చట్టం చేయడం మంచిదేమో.