సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లోని విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన మంత్రిని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే హక్కే లేదని ముందుకు వెళ్లకుండా అడ్డుకుని నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం…ఇన్నేళ్లు గడచినా పూర్తి చేయలేదని సమితి నాయకులు మంత్రిని నిలదీశారు. ఇచ్చిన మాట ప్రకారం విగ్రహం నిర్మించలేని అధికార పార్టీ నాయకులకు రాజ్యాంగ నిర్మాతను తాకే అర్హతే లేదని మండిపడుతూ వ్యతిరేక నినాదాలు చేశారు. చాలా సేపు నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అయితే స్థానిక టీఆర్ఎస్ నేతలు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో మల్లారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి వెనుతిరిగారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)