ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకున్న బిజెపి పార్టీలో ఆనందం పెద్దగా కనిపించడం లేదు. ఎన్డీఏ పక్షాలతో కలిసి బొటాబొటి మెజార్టీ రావడంతో ప్రభుత్వాన్ని కష్టంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. టార్గెట్ 400 అని చెప్పుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఈ సారి 300 లోపే ఆగిపోయిన దుస్థితి. దీని మీద పార్టీ లోపల బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు బలంగా లేకపోయినప్పటికీ ఎటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో దీనిమీద సమీక్ష మొదలైంది. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో బిజెపి నాయకత్వంలో మార్పులు చేయాలని కమల నాథులు తలపోస్తున్నారు. ముఖ్యంగా నిరాశాకరమైన ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో మార్పు తప్పనిసరి అని సంకేతాలు వెలువడుతున్నాయి.
అలాగే బిజెపి కేంద్ర నాయకత్వంలో కూడా మార్పులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పైగా, పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలం గత ఏడాదే పూర్తి కావడంతో ఆయన పదవిని ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఈ లోగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు. నూతనంగా అధ్యక్ష పదవి చేపడతారని భావించిన శివరాజ్ సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రధాన, మోహన్ లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ వంటి వారు కేంద్ర మంత్రివర్గంలో చేరారు. దానితో వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమించడమా? లేదా ఆయన పదవీకాలం కొద్దినెలల పొడిగించి కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించడమా? నిర్ణయించాల్సి ఉంది.
కొందరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో చాలా చోట్ల ఎదురుదెబ్బ తగలడంతో రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీహార్ బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని రాష్ట్రంలో పార్టీ సారథిగా కూడా ఉన్నారు.రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోసి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక సమతుల్యత కోసం అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సహితం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.
ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బిజెపికి తగిలిన ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పార్టీ జాతీయ కార్యవర్గంలో సహితం పలువురు ప్రభుత్వాలలో చేరారు. ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు ఇన్ ఛార్జ్ లను నియమించాల్సి ఉంది. పలువురు కొత్తగా ఎంపీలుగా, ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యారు. పలువురు కేంద్ర మంత్రులకు అవకాశం లభించలేదు. దానితో పలువురు మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.
మొత్తం మీద ఈసారి పార్టీ వ్యవహారాలని నరేంద్ర మోడీ అమిత్ షా సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ దూకుడుకి తగినట్లుగా పార్టీ నాయకత్వంలో మార్పులు చేపడతారని అర్థం అవుతుంది.