దేశంలోనే అతి పెద్ద కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ కు 70 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో 1955 లో ఇది ఏర్పాటు అయింది. కమ్యూనిస్టుల గుత్తాధిపత్యం అధికంగా గల కార్మిక వ్యవస్థలో జాతీయ భావాలతో ఒక సంఘం రూపు దిద్దుకోవటం అంటే చాలా గడ్డు సమస్య. అందులోనూ ఒంటి నిండా కమ్యూనిస్టు భావజాలం కలిగిన నెహ్రూ పాలన సమయంలో బీఎమ్ఎస్ రూపుదిద్దుకొన్నది. ప్రారంభం నుంచి ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని, ప్రగతి దిశగా ముందుకు సాగింది.
కమ్యూనిస్టుల దుర్మార్గ ఆలోచనలు, అడుగుల కింద నలిగిపోతున్న కార్మిక లోకానికి.. భారతీయ మజ్దూర్జా సంఘ్.. తనదైన జాతీయవాదంతో సరికొత్త దారి చూపింది. దేశంలోని కార్మికులంతా కలిస్తే.. ఓ బలమైన భారతదేశాన్ని నిర్మించవచ్చనే సంకల్పంతో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ సంఘ్.. 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. 7 దశాబ్దాలుగా మార్క్సిస్ట్ సిద్ధాంతాలకు దూరంగా.. కార్మిక ఉద్యమంలో గణనీయమైన మార్పులకు వేదికగా నిలిచింది. దేశంలోనే అతిపెద్ద ట్రేడ్ యూనియన్ గా కార్మిక సంస్థగా పేరుగాంచిన బీఎంఎస్.. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు సాధించిన ఘనతలను ఓ సారి గుర్తు చేసుకుందాం..
ఆవిర్భావం:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త మరియు ఆర్థిక వేత్త అయిన దివంగత దత్తోపంత్ థెంగడి.. 1955 జూలై 23న భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్థాపించారు. ఆ సమయంలో కార్మిక ఉద్యమం పూర్తిగా వామపక్ష పార్టీలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉండేది. ఇంకా సంఘ్ కూడా.. ఇప్పటిలా బలంగా కూడా లేదు. అయినప్పటికీ.. కార్మిక లోకాన్ని సరైన దారిలో పెట్టాలనే సదుద్దేశ్యంతో.. బీఎంఎస్ ను ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి ప్రేరణ పొందిన ఈ కార్మిక సంఘం.. చాలా రంగాలలో లెఫ్ట్ ఇంకా కాంగ్రెస్ మద్దతు ఉన్న ట్రేడ్ యూనియన్లకు పోటిగా ఎదిగేందుకు ప్రయత్నించింది.
భారతీయ కార్మిక ఉద్యమం కొత్త భావజాలం:
– ప్రపంచవ్యాప్తంగా ఏకంగా వందేళ్లకు పైగా ట్రేడ్ యూనియన్ ల ఉద్యమాలకు వెన్నెముకగా నిలిచిన వర్గపోరాటం అనే మార్క్సిస్ట్ సూత్రాన్ని బీఎంఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో భారత కార్మిక ఉద్యమానికి కొత్త సైద్ధాంతిక మార్గాన్ని ఏర్పాటు చేసింది. BMS ప్రకారం కార్మిక సమస్యలు దేశ ప్రజల్లోని ఒక వర్గానికి మాత్రమే సంబంధించినవని అనుకోవడం తప్పని చెబుతుంది.
– జీవన పరిస్థితుల క్షీణత కేవలం శ్రమ యొక్క సమస్య కాదని.. శ్రమ ఎల్లప్పుడూ భారతీయ సామాజిక నిర్మాణానికి పునాదిగా పరిగణించబడుతుందని బీఎంఎస్ విశ్వసిస్తుంది. కార్మికులు.. సమాజంలో అంతర్భాగం ఇంకా సమాజ నిర్మాణంలో కీలకమైన భాగమని చెబుతుంది. కావున కార్మికుల సమస్యలు జాతీయమైనవిగా భావించాలని బీఎంఎస్ స్పష్టం చేస్తుంది. అందుకే కార్మికుల ప్రయోజనాలను రక్షించడం ఇంకా ప్రోత్సహించడం అనేవి.. దేశం యొక్క సహజ బాధ్యతగా బీఎంఎస్ అభివర్ణిస్తుంది.
జాతి సమగ్రతకు మద్దుతు:
– మిగతా వారంతా.. మార్క్సిజం ఇంకా సోషలిజం స్థాపన యొక్క లక్ష్యంతో వర్గ సంఘర్షణను తీవ్రతరం చేసే సాధనాలుగా.. తమ ట్రేడ్ యూనియన్లను నిర్వహిస్తారు. కానీ BMS జాతీయవాదం ఇంకా సమగ్రతకు పెద్దపీట వేస్తుంది. అందువల్ల, ఇది వర్గ సంఘర్షణ సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. వర్గ సంఘర్షణ.. దేశం విచ్ఛిన్నానికి దారితీస్తుందని బలంగా నమ్ముతుంది.
మూల సిద్ధాంతాలు:
– అన్ని వర్గాలు.. ఒకే శరీరం యొక్క అవయవాలు అని.. వారి ప్రయోజనాలు పరస్పరం విరుద్ధంగా ఉండకూడదని బీఎంఎస్ మూల సిద్ధాంతాల్లో ఒకటి. ద్వేషం ఇంకా శత్రుత్వం ఆధారంగా వర్గ పోరాటాన్ని వ్యతిరేకించే బీఎంఎస్.. అసమానత, అన్యాయం ఇంకా దోపిడీ వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడుతోంది. గరిష్ట ఉత్పత్తి, సమాన పంపిణి అనే సూత్రానికి బీఎంఎస్ కట్టుబడి ఉంటుంది. దీని ద్వారానే పేదరికాన్ని నిర్మూలన ద్వారా జాతి శ్రేయస్సును సాధించవచ్చని చెబుతుంది.
తొలినాళ్లలో..
– బీఎంఎస్ ఏర్పాటైన తొలినాళ్లలో దాని మనుగడ కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. అంతవరకు ఎందుకు.. బీఎంఎస్ మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించేందుకు ఏకంగా 12 ఏళ్లు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. తొలి సమావేశాన్ని.. 1967 లో ఢిల్లీలో నిర్వహించారు. మొత్తం 541 యూనియన్లు.. బీఎంఎస్ తో అనుబంధంగా ఉండగా.. మొత్తం సభ్యుల సంఖ్య 2.46 లక్షలు మాత్రమే. అదే సమావేశంలో బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దత్తోపంత్ థెంగడిని, తొలి అధ్యక్షుడిగా రామ్ నరేశ్ ను ఎన్నుకున్నారు.
అతిపెద్ద కార్మిక సంస్థగా అవతరణ:
– బీఎంఎస్ సాధించిన తొలి మైలు రాయి ఏంటంటే.. 1984 లో అంటే 29 ఏళ్లకు దేశంలోనే రెండవ అతిపెద్ద సెంట్రల్ ట్రేడ్ యూనియన్ గా ఆవిర్భవించింది. ఆ సమయంలో బీఎంఎస్ లో 12.11 లక్షల మంది కార్మికులున్నారు. అలాగే 1996 నాటికి 31 లక్షలకు పైగా కార్మికులతో దేశంలోనే అదిపెద్ద కార్మిక సంస్థగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి సంస్థ అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. దేశంలోనే బలీయమైన కార్మిక సంస్థగా అవతరించింది.
– ప్రస్తుతం కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పరిశ్రమలను 44 రకాలుగా వర్గీకరించారు. అయితే అన్నిరకాల పరిశ్రమల్లో బీఎంఎస్.. అనుబంధ సంఘాలను కలిగి ఉండటం విశేషం. ప్రస్తుతం BMS.. దాదాపు కోటి మంది సభ్యులను కలిగి ఉండటంతో పాటు.. 6,300 కి పైగా అనుబంధ కార్మిక సంఘాలు ఇంకా 44 అఖిల భారత పారిశ్రామిక సమాఖ్యలతో కూడిన విస్తారమైన నెట్వర్క్ను కలిగి ఉంది. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత ప్రత్యేక ప్రాంతీయ యూనిట్ కార్యాలయం ఉండటంతో పాటు.. జిల్లా కార్యాలయాలు కూడా ఉన్నాయి.
భారతీయ ధృక్కోణంలో కార్మిక ఉద్యమం:
– BMS యొక్క ప్రధాన నినాదం బలమైన జాతి నిర్మాణమే. ఎందుకంటే ఇది ఇతర కార్మిక సంఘాల మాదిరిగా ‘వర్గ పోరాటం’ అనే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని పట్టుకుని.. ఘర్షణాత్మక విధానాన్ని అవలంబించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఆయా సంఘాలు.. యజమానులు ఎప్పుడూ దోపిడీకి పాల్పడుతున్నారనే అభిప్రాయాన్ని కల్పిస్తారు. కార్మికులు ఎప్పుడూ శ్రమజీవులుగా, పేదలుగా చూపిస్తారు.
– కానీ.. బీఎంఎస్ మాత్రం.. కార్మికులు పరిశ్రమ యొక్క సహ-యజమానులనే సిద్ధాంతం ఆధారంగా శ్రమశక్తి భావనను ప్రచారం చేస్తుంది. “శ్రమను జాతీయం చేయండి, పరిశ్రమను శ్రమశక్తిగా చేయండి ఇంకా దేశాన్ని పారిశ్రామికీకరణ చేయండి” అనే నినాదంతో బీఎంఎస్ కార్మిక సంఘం పనిచేస్తుంది.
కేంద్ర నిర్ణయాలను సైతం తప్పుబట్టిన బీఎంఎస్:
– సంఘ్ స్ఫూర్తిగా ఏర్పడింది కాబట్టి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చెబితే అది గుడ్డిగా నమ్ముతుందని చెప్తే అది పూర్తిగా అబద్ధం అవుతుంది. చాలాసార్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించింది. అందుకే భారతీయ మజ్దూర్ సంఘ్.. స్వతంత్య్ర కార్మిక సంస్థగా చెబుతారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాల విషయంలో బీఎంఎస్ చాలా కీలకంగా వ్యవహరించింది. మొత్తం నాలుగింటిలో రెండు చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు బీఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురేంద్ర కుమార్ పాండే తెలిపారు. పారిశ్రామిక సంబంధాలు ఇంకా వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల అనే రెండు చట్టాల్లోని కొన్ని నిబంధనలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆమోదించినట్లయితే.. BMS ఆందోళనకు దిగుతుందని పాండే హెచ్చరించారు కూడా.
– కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఎన్నో పోరాటాలు చేసిన బీఎంఎస్.. బడ్జెట్ సమయంలో కేంద్రానికి ప్రతిపాదనలు చేయడం సాధారణ విషయం. ముఖ్యంగా పన్ను మినహాయింపులు, ఉపాధి హామీల అమలు, దేశీ తయారీని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని.. గత బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రిని సైతం బీఎంఎస్ ప్రత్యేకంగా కోరింది.
– 8 వ వేతన సంఘాన్ని అమలు చేయడం, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం, కొత్త పెన్షన్ పథకం, యూనివర్సల్ పెన్షన్ పథకం స్థానంలో పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించడం, గ్రాట్యుటీ లెక్కలను సంవత్సరానికి 15 రోజుల నుండి 30 రోజులకు పెంచడం, పెన్షనర్లను ఆదాయపు పన్ను చెల్లించకుండా మినహాయించడం వంటి డిమాండ్లను ఆర్ధికశాఖ ముందుంచింది.
విశ్వకర్మ జయంతి రోజే.. కార్మిక దినోత్సవం
– భారతీయ మజ్దూర్ సంఘ్.. ఎప్పుడూ మే 1 న కార్మిక దినోత్సవం జరుపుకోదు. మే 1 ని గుడ్డిగా వ్యతిరేకించకుండా.. అందుకు బలమైన కారణాలు కూడా చూపుతుంది. విశ్వకర్మ అనేది నేటి ఆలోచనా విధానంలో.. సమూల మార్పును సూచిస్తుంది. ఇది పశ్చిమ దేశాల యజమాని-సేవకుడి సంబంధానికి లేదా కమ్యూనిస్టుల.. వర్గ శత్రువు భావనకు భిన్నంగా కనిపిస్తుంది. పాశ్చాత్యుల నుంచి దిగుమతి చేసుకున్న మే డే, శ్రమను సానుకూలంగా ప్రేరేపించడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి.. విశ్వకర్మ భావనే దేశంలో సరైందని చెబుతారు.
– పనిని ఒక యజ్ఞంగా పరిగణించడం.. భారతీయ పారిశ్రామిక సంబంధాలు సైతం.. సాంప్రదాయక కుటుంబం లాంటి సంబంధాలపై విశ్వకర్మ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. అందుకే BMS పారిశ్రామిక కుటుంబం అనే గొప్ప భావనను ముందుకు తీసుకొచ్చింది. విశ్వకర్మ వంటి గొప్ప వ్యక్తుల జీవితం నుంచి త్యాగ్-తపస్య-బలిదాన్, పని అంటే ఆరాధన, శ్రమను జాతీయం చేయాలన్న నినాదాలను బీఎంఎస్ స్వీకరిస్తుంది.
– విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. దీనికి కారణం ఏంటంటే.. చాలా చోట్ల దీనిని భద్రపద శుక్ల పంచమిగా.. మరికొన్ని చోట్ల మాఘ శుక్ల త్రయోదశి నాడు జరుపుకుంటారు. దీంతో ఒక తేదీ నిర్ణయించుకుని ఆనాడు జాతీయ కార్మిక దినోత్సవాన్ని బీఎంఎస్ జరుపుకుంటుంది.
దేశ రాజధానిలో 70 వసంతాల వేడుక
– ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న భారతీయ మజ్దూర్ సంఘ్.. సగౌరవంగా 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ జూలై 23 న దేశ రాజధాని ఢిల్లీలో 7 దశాబ్ధాల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ పరమ పూజనీయ డా.మోహన్ జీ భాగవత్ గారు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యూనియన్ యొక్క మౌలిక సూత్రాలతో లక్ష్యాలను గుర్తు చేయనున్నారు.
– 70 ఏళ్ల వేడుకల నిర్వహణ కోసం ఏడాది కాలంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. అట్టడుగు స్థాయి కార్మికులతో కనెక్ట్ అవ్వడానికి ‘శ్రామిక్ మహాసంపర్క్ అభియాన్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే.. ‘పంచ పరివర్తన్’ పై ఉపన్యాసాలు, ఇంకా యువత, మహిళా కార్మికుల కోసం సమావేశాలు నిర్వహించారు.
– కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం రెండు రకాల ఉద్యమాలు చేసిన ఘనత వహించిన బీఎంఎస్.. నేషన్ ఫస్ట్ అనే నినాదానికి కట్టుబడి ఉంటుంది. అందుకే దేశంలోని మిగతా కార్మిక సంఘాలతో పోల్చితే.. బీఎంఎస్ పూర్తిగా ప్రత్యేకం అని చెప్పొచ్చు.
ఈ సందర్బంగా బీ ఎమ్ ఎస్ సోదరులకు శుభాకాంక్షలు చెబుదామా..