కార్మిక సంఘాల వ్యవస్థలో నిర్మాణాత్మకంగా ఎదిగిన సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ చీఫ్ అయిన సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జీ భాగవత్ అన్నారు. వార్సికోత్సవ సమయంలో ఆత్మ పరిశీలన దిశగా ఆలోచించినప్పుడే నిర్మాణాత్మకమైన ప్రగతి సాధ్యం అవుతుంది అని ఆయన చెప్పారు. సంఘ్ స్ఫూర్తితో కార్మిక వ్యవస్థలో పనిచేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్తాపించి 70 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ మహా సభ కు మోహన్ జీ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా బీ ఎమ్ ఎస్ స్థాపించినప్పుడు పరిస్థితులను మోహన్ జీ గుర్తు చేసుకొన్నారు. ఈ సంస్థ ను ప్రారంభించిన దత్తోపంథ్ ఠేంగ్డే .. ఈ సంస్థను ప్రారంభించిన సమయంలో అనేక ఇతర కార్మిక సంఘాల వారితో కూడా కలుసుకునేవారని, ఆ సయమలో బీఎంఎస్ చాలా చిన్నదన్నారు. ఆ సమయంలో ‘‘మీ కాషాయ జెండా ఈ ట్రేడ్ యూనియన్ రంగంలో ఎదగదు అని ఎగతాళి చేశారు. కార్మికుల్లారా ప్రపంచాన్ని ఏకం చేయండి. అనే సిద్ధాంతాన్ని వారు ప్రశ్నించేవారు. కార్మికులు ఇలా ఎలా ఆలోచిస్తారు? అని ఠేంగ్డేని అడిగేవారు. కానీ.. నేడు.. 70 సంవత్సరాల తర్వాత ఠేంగ్డే దార్శనికత ఏమిటో నిరూపితమైపోయింది. ఇదంతా బీఎంఎస్ కార్యకర్తల అవిశ్రాంత ప్రయత్నాల ద్వారానే సుసంపన్నమైంది’’ అని మోహన్ భాగవత్ హర్షం వ్యక్తం చేశారు.
ప్రారంభ సమయంలో బీఎమ్ఎస్ కోసం ఎలాంటి కసరత్తు జరిగిందో మోహన్ జీ వివరించారు. దత్తోపంత్ పని నేర్చుకోవడానికి ఇతర కార్మిక సంస్థల్లో కూడా చేశారని, అవి కూడా పనిచేస్తున్నాయని తెలుసుకున్నారని, అయితే వాటికి సరైన సైద్ధాంతిక పునాదులు లేవన్న విషయాన్ని గ్రహించారన్నారు. అయితే.. ప్రస్తుతం బీఎంఎస్ కి బలమైన సైద్ధాంతిక పునాదులు వున్నాయని, కానీ కార్యక్షేత్రంలో దానిని అమలు చేసి, సరైన వ్యసవ్థను అభివృద్ధి చేయడమే ఇప్పుడు సవాల్ తో కూడిన అంశమన్నారు.
ఇక.. దత్తోపంత్ రాజ్యసభకు ఎన్నికైన సందర్భాన్ని కూడా మోహన్ భాగవత్ గుర్తు చేసుకున్నారు. ‘‘దత్తోపంత్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సమయంలో అప్పటి సరసంఘచాలక్ గురూజీ దగ్గరికి వెళ్లారు. ఇప్పుడు కార్మికుల కోసం నేనేం చేయాలి? అని అడిగారు. అప్పుడు గురూజీ బదులిస్తూ.. ఓ తల్లి తన బిడ్డపై ప్రేమతో వున్నట్లే..ఆ భావోద్వేగంతో కార్మికులతో మరింత దగ్గరగా పనిచేస్తే మీరు మరింత విజయం సాధిస్తారు.’’ అని చెప్పారని వెల్లడించారు.
ఈ సందర్బంగా కొన్ని ఉదాహరణలను డాక్టర్ మోహన్ జీ విశ్లేషించారు. ‘‘1980 లో జరిగిన బీఎంఎస్ సమావేశానికి కమ్యూనిస్టు నేత ఎంజీ గోఖలే హాజరయ్యారు. ఆరెస్సెస్ శాఖ ఆయన ఇంటిముందే జరిగేది. దాన్నంతా గమనించేవాడు. దాని తర్వాత సంఘ్ ఆలోచనలకి కాస్త దగ్గరయ్యారు.పూర్తి దార్శనికత కలిగిన సంస్థ బీఎంఎస్ మాత్రమే. కానీ దానికి సరైన వ్యవస్థ లేదు. దీనిని దత్తోపంత్ పూర్తిగా అంగీకరించారు. మన భావజాలం మంచిదే కావచ్చు. కానీ మన కార్యపద్ధతి ఇంకా పూర్తిగా దానికి అనుగుణంగా మారిపోలేదు. సిద్ధాంతం, కార్యాచరణ సమన్వయం అయ్యేలా వ్యవస్థను సరిదిద్దుకోవాలి. నేడు ఆ చివరిలో దశలో వున్నాం’’ అని మోహన్ భాగవత్ అన్నారు.
సనాతన ధర్మంలో జీవితానికి సంబంధించిన నాలుగు మూల స్తంభాల్లో పరిశ్రమ కూడా ఒకటని అన్నారు. అయితే బీఎంఎస్ ప్రపంచానికి ఓ కొత్త, శాశ్వతమై నమూనాను అందించడానికి కృషి చేసిందని, కాలం మారుతున్న కొద్దీ, ఈ యుగానికి తగిన నమూనాను మనం అభివృద్ధి చేసి, ప్రజల ముందు వుంచాలని సూచించారు. అయితే దీనికి సమతుల్యత అవసరమని, మొదటి తరం ఈ కార్యాన్ని ప్రారంభించినట్లే… రెండో తరం దానిని కొనసాగించినట్లే, మూడోతరం, నాలుగో తరాలు దానిని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారు, మనం ఎందుకు కొనసాగించాలో అర్థం చేసుకోవాలని వివరించారు.
ఆధునిక కాలంలో ఉన్న సవాళ్లను మోహన్ జీ విశ్లేషించారు. ఒకప్పుడు ప్రజలు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లేవారని, తర్వాత సైకిళ్లు వచ్చాయని వివరించారు. తమ కాలంలో సైకిళ్లతోనే తిరిగేవారిమని, ఆ తర్వాత కార్లు వచ్చాయని, కార్లు లేకుండా తిరగడానికి ఇష్టపడటం లేదన్నారు. బీఎంఎస్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక సంస్థ అని, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాల్సిన బాధ్యత బీఎంఎస్ పై వుందని సూచించారు. ప్రపంచం బీఎంఎస్ ను గమనిస్తోందని, ఈ బాధ్యతను భుజానికెత్తుకోవాలని మోహన్ భాగవత్ సూచించారు. ప్రస్తుతం 50 సంవత్సరాల కంటే ముందు లేని సవాళ్లు ఇప్పుడున్నాయని, అసంఘటిత రంగం చాలా విస్తృతమైపోయిందని, వ్యవస్థీకృతం కూడా అయ్యిందన్నారు. అయితే చాలా రకూ అసంఘటితంగానే వుందని, అయితే.. కార్మికుల ఆత్మ గౌరవ పునరుద్ధరణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పని స్వభావం అనేది ప్రాంతాలను బట్టి మారుతూ వుంటుందని, అందుకే సరైన కార్యాచరణ, సమన్వయం అనేది క్షేత్ర స్థాయి వాస్తవాలకు అనుగుణంగా రూపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు బాగయ్య, బీ ఎమ్ ఎస్ అఖిల భారతీయ పెద్దలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఈ సందర్బంగా బీ ఎమ్ ఎస్ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు.