ప్రపంచ దేశాల్లో భారత మీద నమ్మకం అంతకంతకు పెరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ .. సర సంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ వెల్లడించారు . ఇందుకు అనుగుణంగా ఈ నమ్మకాన్ని పెంచేట్లు గా పౌరులు మెలగాలని ఆయన సూచించారు. భారత్ నుంచి ప్రపంచ దేశాలు నాయకత్వాన్ని ఆశిస్తున్నాయని, భారత్ ఈ స్థాయికి రావడానికి అనేక మంది తమను తాము అంకితం చేసుకున్నారని, వారి వల్లే ఈ స్థాయికి వచ్చామన్నారు.
భీవండిలోని పద్మశ్రీ అన్నాసాహేబ్ జాదవ్ భారతీయ సమాజ్ ఉన్నతి మండల్ లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ప్రపంచానికి నాయకత్వం వహించాలని, దీని ద్వారా దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లగలమని పేర్కన్నారు. రాబోయే తరాలు ఈ మార్గాన్నిఅనుసరిస్తుందన్న నమ్మకం తనకుందని ప్రకటించారు. ఈ మార్గాన్ని అనుసరిస్తూ విశ్వ వేదికపై భారత్ ని చూసే గర్వపడేలా చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
జాతీయ జెండాలోని కాషాయ రంగు త్యాగాన్ని సూచిస్తుందని, నిస్వార్థ తత్వాన్ని ప్రేరేపిస్తుందని, తెలుపు స్వచ్ఛతను, ఆకుపచ్చ రంగు శ్రేయస్సును సూచిస్తుందని తెలిపారు. అలాగే అశోకచక్ర సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని, ఐక్యతను సూచిస్తుందని వివరించారు. ఇవన్నీ దేశ పురోగతికి అత్యంత కీలకమని తెలిపారు. మతమనేది కేవలం ఆరాధనకు మాత్రమే కాదని, ప్రవర్తనకు సంబంధించిందని అంబేద్కర్ పేర్కొన్నారని గుర్తు చేశారు. సోదర భావమే శాశ్వతమైన మతమని తెలిపారు. సౌభ్రాతృత్వం ఆధారంగా నడుచుకుంటే కుటుంబాల ఉన్నతి వుంటుందని, దానికి సమానంగా సమాజం కూడా పురోగమిస్తుందన్నారు.
ఈ స్ఫూర్తిని ప్రజలంతా గుర్తించి గౌరవించాలని మోహన్ భాగవత్ వివరించారు.