స్వరం పెంచిన భజన బృందం!!
కల్వకుంట్ల యువరాజు తారకరామారావును ముఖ్యమంత్రిని చేయాలంటూ తెరాసలోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరస్ పాడుతున్నారు. అతి త్వరలోనే ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని, లేకపోతే బతకలేమని డైలాగులు చెప్పే స్థాయిలో కొందరు అతి చేస్తున్నారు. కుటుంబ పార్టీ తెరాసలో రాజు చంద్రశేఖర రావు అయితే యువరాజు ఎవరనేది అందరికీ తెలుసు. తదుపరి తరం యువరాజు కూడా క్రమంగా ఎదుగుతున్నాడు కూడా. కెసిఆర్ కాళేశ్వరం టూర్ తర్వాత సీఎం మార్పు తథ్యమని ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి. ప్రగతి భవన్ టు ఫాం హౌస్. మళ్లీ ఫాం హౌస్ టు ప్రగతి భవన్. కెసిఆర్ పనితీరు దీనికే పరిమితం అనే విమర్శలు కొత్త కాదు. గత ఐదేండ్లుగా ఆయన ఆఫీసు ముఖం చూడలేదు. నువ్వు సచివాలయానికి ఎందుకు పోవు అని అడిగినోళ్లకు, దాన్ని కూల్చేసి తన దొరగిరీని చూపించారు. గడీల పాలనను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఆఫీసుకు పోకుండా నెలకు లక్షరాలా 4 లక్షల 10 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు. 130 కోట్ల జనాభాగల భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయకుడి కంటే 4 కోట్ల జనాభాగల తెలంగాణ ముఖ్యమంత్రి జీతమే ఎక్కువ.
మిషన్ భగీరథలో గోల్ మాల్ ఆరోపణలు కొత్త కాదు. కాళేశ్వరం ప్రాజెక్టయితే అవినీతి పునాదులపై అడుగడుగునా అక్రమాల అనే ఆరోపణలు కో కొల్లలు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను దారి మళ్లించడం, కెసిఆర్ తన పేరుతో స్టిక్కర్ అతికించుకోవడం ఈమధ్య మరీ మితిమీరింది. గర్భిణీకి, శిశువుకు కేంద్రం అవసరమైన వస్తువులను అందజేయడానికి ఇచ్చే డబ్బను వేరే పేరుతో దారి మళ్లించి, కెసిఆర్ కిట్ అని ముఖ్యమంత్రి పేరే పెట్టుకోవడం మోసానికి పరాకాష్ట. ఇలాంటి విన్యాసాలతో పొద్దుపుచ్చతున్న కెసిఆర్, తన తన పుత్రరత్నాన్ని సీఎం చేయబోతున్నారనే ప్రచారం తరచూ జరుగుతూ ఉంటుంది. ఓ రెండు రోజులుగా తెరాసలోని నిలయ విద్వాంసుల్లాంటి వందిమాగధులు కొందరు సీఎం అంటే కెటిఆర్, కెటిఆర్ అంటే సీఎం అనే స్థాయిలో భజన చేస్తున్నారు. కొడుకును సీఎం ను చేసి పర్మినెంటుగా ఫాం హౌస్ లో వ్యవసాయం చేసుకోవచ్చు కదా అని కూడా కొందరు కల్వంకుంట్ల దొరకు సలహా ఇస్తున్నారట. అంటే ఏ క్షణమైనా యువరాజా వారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడం ఖాయమేనా? ఏమో చూద్దాం.