తెలంగాణ సమాజంలో బోనాల సందడి ఊపందుకొంది. బోనాల సీజన్లు పాతబస్తీ బోనాల గురించి తప్పకుండా చెప్పుకోవాలి. లాల్ దర్వాజా బోనాలతో పాతబస్తీలో కొత్త సందడి నెలకొంటుంది. అసలు సిసలు తెలంగాణ సందడి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.
అనేక దశాబ్దాలుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు వివిధ క్షేత్రాలు ఈ బోనాల ను ఎంతో ప్రోత్సహిస్తున్నా యి. ఇటువంటి వేడుకల ద్వారా కులాలు , వర్గాలు , ప్రాంతాలు పక్కనపెట్టి హిందువులంతా ఒక్కటే అన్నా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. అందుచేత బోనాల సందర్భంగా ఆయా కాలనీలలోని ప్రజలంతా ఒకచోటకు చేరి అమ్మవారికి బోనాలు సమర్పించి మురిసిపోతారు. అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు తీసుకుని ఇళ్ళకు మరలుతారు.
భక్తుల కొంగు బంగారం లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారు.. కోరిన భక్తుల కొంగుబంగారంలా చల్లటి తల్లిగా, కల్పవల్లిగా పాతబస్తీ లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం తెలంగాణ ప్రజలకు ఆరాధ్య దైవంగా విరాజిల్లుతుంది. పాతబస్తీలో మత సామరస్యాన్ని కాపాడుతూ, ప్రజలకు సుఖ సంతోషాలను అందించే ఆదిశక్తిగా కొలువుదీరిన మహంకాళి చారిత్రాత్మక ఆలయంగా ప్రసిద్ధి చెందిన లాల్ దర్వాజా అమ్మవారి ఆలయాన్ని స్థానికులు సుమారు వంద ఏళ్ల కిందట పునరుద్దరించారు.
మరోవైపు, ముఖ్యంగా ఈ బోనాల వేడుకలలో మహిళల పాత్ర ప్రధానమైనది. బోనం ఎత్తుకున్న ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. అందుచేత బోనం ఎత్తుకున్న ఆడపిల్లల కాళ్లకు మొక్కి ఆశీస్సులు అందుకొంటారు. మన సమాజంలో ఆడవాళ్లను గౌరవించే సాంప్రదాయం ఈ విధంగా చాటి చెప్పడం సాధ్యమవుతుంది.
ఆషాఢం అంతా జంట నగరాల్లో బోనాల సందడి సాగుతూనే ఉంటుంది. ఆదివారాలలో అమ్మవారి ఆలయాలలో బోనాలు సమర్పిస్తుంటారు.
గోల్కొండ తో ప్రారంభమైన బోనాల జాతర.. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పించడంతో ముగుస్తుంది. నిజాం కాలం నాటి నుంచే ఇక్కడ బోనాలు జరిపిన చరిత్ర ఉంది. 1908లో ముంచెత్తిన వరదల్లో హైదరాబాద్ నగరం అల్లకల్లోలంగా మారిన సందర్భంలో.. అప్పటి ప్రధాని మహారాజ కిషన్ ప్రసాద్ సూచనల మేరకు నిజాం నవాబ్ మీర్ మహమూద్ ఆలీ ఖాన్ మహంకాళికి పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది. నిజాబ్ నవాబ్ లాల్‌దర్వాజా ఆలయం నుంచి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలను చాటలో తీసుకువెళ్లి మూసీ నది తల్లికి సమర్పించడంతో వరద ప్రవాహ ఉధృతి తగ్గి పోవడంతో.. అప్పటి నుంచి రాష్ట్ర రాజధాని నగరంలో ప్రతి యేటా ఆషాడ మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
లాల్ దర్వాజా అమ్మవారి గుడి కి చాలా ప్రాశస్త్యం ఉంది.
1968లో కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి.. శ్రీ అమ్మవారి విగ్రహాన్ని పున:ప్రతిష్ఠించారు. నాటి నుంచి ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా పూజలు జరుగుతున్నాయి. దీంతో ఆలయానికి మరింత విశిష్ఠత చేకూరింది. ప్రతి యేటా ఆషాఢ మాసంలో పది రోజలు పాటు నిర్వహించే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు తరలిరావడం విశేషం. బోనాల సందర్భంగా ఒకప్పుడు జంతు బలులు జరిగేవి. అయితే 1953లో ఆర్యసమాజం, స్థానిక జీవ కారుణ్య ప్రతినిధుల సూచన మేరకు.. జంతుబలి స్థానంలో గుమ్మడికాయలను బలి ఇస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు ఆలయ పునరుద్దరణకు విశేష కృషి చేశారు. భద్రత కోసం అప్పట్లో నగరం చుట్టూర నిర్మించిన 13 దర్వాజాలలో లొల్ దర్వాజా ఒకటి. నగర భద్రత కోసం రాత్రివేళలో ఈ దర్వాజాలు మూసేవారు. ఒకసారి రాత్రి దర్వాజాలు మూస్తే, ఎట్టి పరిస్థితిలోనూ తెల్లవారుజాము వరకు తెరిచేవారు కాదు. అయితే ఇక్కడి దర్వాజా ఎర్రని రంగులో ఉండడంతో లాల్దర్వాజాగా పేరొందింది. ఈ అమ్మవారి సింహాన్ని వాహనంగా కలిగి ఉండడంతో సింహవాహని మహంకాళిగా పేరుగాంచింది.
ఈ ఆలయంతో పాటు ఆదివారం అక్కన్న మాదన్న ఆలయం, మీరాలం మండి మహంకాళి ఆలయం, మేళా ముత్యాలమ్మ ఆలయం, ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంతోపాటు.. పాతబస్తీలోని మరో 23 ఆలయాలల్లో కూడా బోనాల వేడుకలు ఏకకాలంలో జరగనున్నాయి. ఉదయం జల్లెకడువతో పండగ ప్రారంభమవుతుంది. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సైతం సమర్పిస్తారు. తర్వాతి రోజు వచ్చి మట్టికుండ మీద నిలబడ్డ అమ్మవారు.. భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఇక తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి.. నదిలో నిమజ్జనం చేస్తారు.
మొత్తం మీద లాల్ దర్వాజా బోనాలకు పాతబస్తీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ సందడిగా మారుతాయి. ఇంటిల్లపాది ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అమ్మల కన్న అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు అందుకుని ఇళ్లకు మరలతారు.