బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలను హైదరాబాద్ హైందవ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోంది. హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న అల్లరి మూకలకు బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చింది. ఒక కుట్ర ప్రకారమే ఈ దాడులు జరుగుతున్నాయని దీనికి గట్టి ప్రత్యుత్తరం ఇవ్వాలని సూచించింది. ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ వేదికగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ ఐక్య వేదిక ఒక బహిరంగ కార్యక్రమం నిర్వహించింది.
ఈ సంఘీభావ సభలో ఇస్కాన్ సహా హిందూ పీఠాలకు చెందిన స్వాములు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సహా పలు జాతీయవాద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. రక్తమోడుతున్న బంగ్లాదేశ్ పై ప్రపంచం దృష్టి సారించి అక్కడ హిందువులు సహా అక్కడి మైనార్టీల హక్కులను కాపాడాలని, జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. హిందువుల రక్షణ కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే ఆ యుద్ధంలో తామే ముందుంటామన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆర్ ఎస్ ఎస్ జ్యేష్ట ప్రచారకులు భాగయ్య మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జైలుకు పంపిన ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణ దాస్ మనోబలంతో పోరాడుతున్నారని, తప్పక విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువులు ఆ దేశాన్ని వీడిపోకుండా పోరాడి ఆత్మగౌరవంతో అక్కడే ధైర్యంగా ఉండే రోజులు త్వరలో కచ్చితంగా వస్తాయన్నారు.
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్విగ్న భరితంగా మాట్లాడారు. బంగ్లాదేశ్ హిందువులను కాపాడేందుకు సైనిక చర్య చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే చేతలతోనే సాధ్యమంటూ ఇంకా నిరీక్షిస్తే అక్కడ ఒక్క హిందువు కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్, ఆయన తరఫున వాదించే లాయర్‌పై దాడి, హిందువులపై హింసాకాండ పరిణామాలను ఖండించారు. ఒకనాడు బంగ్లాదేశ్ ముస్లింలపై పాకిస్తాన్ ముస్లింలు మారణకాండ జరిపినప్పుడు భారత సైన్యం రంగంలోకి దిగి బంగ్లాదేశ్ ప్రజల్ని కాపాడిన సంఘటనలను గుర్తు చేశారు.
ఇస్కాన్‌కు చెందిన స్వామి మాధవ స్వామి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ భక్తులపై తుపాకులు గుచ్చి చంపడానికి సిద్ధంగా ఉన్నారని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వాములకు ప్రసాదంగా శాకాహారాన్ని ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి పెద్దలు కూడా మాట్లాడని పరిస్థితి ఉందంటూ బంగ్లాదేశ్‌లో ఇస్లాం, ఇస్కాన్‌తో పాటు అన్ని ధర్మాలూ సహజీవనం చేసే పరిస్థితి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
జైశ్రీరామ్ నినాదాలతో ధర్నాచౌక్ ప్రాంతం మార్మోగింది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన హిందూ బంధువులతో ఆ ప్రాంతం కిక్కరిసిపోయింది.