పుల్వామా దాడిని సమర్థిస్తూ వేడుకలు చేసుకోవడంతో పాటు సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన బెంగళూరు విద్యార్థి ఫైజ్ రషీద్ ను ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్‌లో 3వ సంవత్సరం చదువుతున్న రషీద్‌ను 2019లో ఇంటి సమీపంలో అరెస్ట్ చేశారు. తూర్పు బెంగళూరులోని హెచ్ఆర్బిఆర్ లేఅవుట్ నివాసి అతను. ఉగ్రదాడి తరువాత ఆ దాడుల్ని సమర్థిస్తూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టెందుకు ఎఫ్బీ అకౌంట్ క్రియేట్ చేశాడు. దీంతో కొందరు… బెంగుళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. బాణవాడిలో అతనిపై కేసు నమోదైంది. దీంతో అదే ఏడాది ఫిబ్రవరి 17లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రషీద్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
మతవిద్వేషాలు రెచ్చగొట్టినందుకు గాను, చట్టవిరుద్ధ కార్యకలాపాలకింద అతనికి ఐదేళ్ల కారాగార శిక్షను విధించింది బెంగళూరు ప్రత్యేక కోర్టు. దాంతోపాటు 25వేల జరిమానా విధించింది. చెల్లించని పక్షంలో మరో ఆరునెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
14 ఫిబ్రవరి 2019న పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. 2500 మందికి పైగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సెలవులు ముగించుకుని కశ్మీర్ లోయలో విధుల్లో చేరారు. 70 వాహనాల్లో వాళ్లంతా వెళ్తుండగా… అవంతిపోరా సమీపంలో హైవేపే ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. 40 మంది సిబ్బందిలో ఉన్న బస్సును 3 వందల కిలోల పేలుడు పదార్థాలున్న వాహనంతో ఢీకొట్టాడు ఉగ్రవాది. దీంతో భారీ పేలుడు సంభవించి అందులోని 40మంది సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. జేషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ఈ ఘోరానికి పాల్పడినట్టు తేలింది.
ఆ తరువాత కొన్ని రోజులకే సరిహద్దు ఆవలి బాలాకోట్ పై వైమానిక దాడి చేసింది భారత్. పాకిస్తాన్ కు చెందిన పలువురు ఉగ్రవాదులు ఆ ఆపరేషన్‌లో హతమయ్యారు.