బెంగాల్లో బిజెపికి డబుల్ ధమాకా!
పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి తహతహలాడుతున్న భారతీయ జనతా పార్టీకి, ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా సానుకూల పరిణామాలు ఎదురవుతున్నాయి. బిజెపి స్వతహాగా బలపడుతోంది. ఇతర పార్టీల వైఖరి కూడా దానికి సంతోషాన్నిస్తున్నది. మమతా బెనర్జీ భారీగా ఆశలు పెట్టుకున్న ముస్లిం ఓటు బ్యాంకుకు గండికొట్టడానికి ఎంఐఎంతో పాటు మరో ముస్లిం సంస్థ సిద్ధంగా ఉంది. కనీసం 70 సీట్టకు పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తున్నది. ముస్లింలలో గట్టి పట్టున్న ఒక మత సంస్థ మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇదే జరిగితే మమత ఆశలు గల్లంతు కావచ్చు. బెంగాల్లో దాదాపు 32 శాతం మంది ముస్లింలున్నారు. బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు కూడా లక్షల్లో ఉన్నారనే ఆరోపణలున్నాయి.
బెంగాల్లోని 23 జిల్లాలకు గాను మూడు జిల్లాల్లో ముస్లింలదే మెజారిటీ. ముర్షీదాబాద్, మాల్దా, ఉత్తర దినాపూర్ ముస్లిం మెజారిటీ జిల్లాల్లో మొత్తం మీద 43 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్టలోని 294 అసెంబ్లీ సీట్లలో కనీసం 120 చోట్ల ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వాటిలో తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో 90 సీట్లు గెల్చుకుంది. ఈసారి ఎంఐఎం పోటీకి దిగితే ఫలితాలు తారుమారు కావచ్చు. ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం గెలవడంతో ఎన్డీయే అధికారంలోకి రావడానికి మార్గం సుగమమైంది. బెంగాల్లో కూడా అదే జరుగుతుందేమో అని మమతా బెనర్జీ ఆందోళన చెందుతున్నారని అర్థమవుతుంది. అది జరగకుండా ప్రయత్నిస్తున్నారు. ఎంఐఎం బెంగాల్ శాఖ అధ్యక్షుడిని తృణమూల్ కాంగ్రెస్ లో చేర్చుకున్నా పెద్దగా ఉపయోగం ఉంటుందా అనేది ప్రశ్న.
ఇక బిజెపికి మరింత సానుకూల పరిణామం మరొకటి ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది తృణమూల్ కు పిడుగుపాటు లాంటి వార్తే. ఎందుకంటే ఈ కూటమి వల్ల ముస్లిం ఓట్ల కొంత వరకు, హిందూ ఓట్లు చాలా వరకు చీలిపోవచ్చని పరిశీలకుల అంచనా. తృణమూల్ కాంగ్రెస్ వారికి ఇది కలవరం కలిగించే పరిణామం. మమతా బెనర్జీతో పొత్తు సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు చాలా కాలంగా భావిస్తున్నారు. ఆమె తాను చెప్పిందే అందరూ వినాలనే ధోరణి కాంగ్రెస్ వారికి ఏమాత్రం నచ్చలేదు. కాబట్టే వామపక్షాలతో పొత్తుకు జైకొట్టారు.
ఇక ఇజెపి గత ఆరేళ్లుగా వ్యూహాత్మకంగా బలం పెంచుకుంటోంది. హిందూ ఓటు బ్యాంకును చాలా వరకు హస్తగతం చేసుకుందని పరిశీలకుల అంచనా. 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 లోక్ సభ సీట్లకు గాను 18 సీట్లను బిజెపి గెల్చుకుంది. మిగతా చోట్ల చాలా వరకు రెండో స్థానంలో నిలిచింది. తాజా పరిణామాలతో తమ గెలుపు నల్లేరుమీద నడకే అనేది కమలనాథుల ధీమా. అది నిజమవుతుందో లేదో చూద్దాం.