ఉక్రెయిన్‌లో చిక్కుకున్న బంగ్లాదేశీ విద్యార్థులను సురక్షితంగా చేర్చిన మోదీకి లేఖ రాశారు ఆదేశ ప్రధాని షేక్ హసీనా. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను ఆపరేషన్ గంగా పేరిట సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే 9 మంది బంగ్లాదేశీ విద్యార్థులు, పౌరులను కూడా భారత ప్రభుత్వం కాపాడి స్వదేశం చేర్చింది. అయితే భారత్ సాయాన్ని గుర్తు చేసుకుంటూ మోదీకి ధన్యవాదాలు చెబుతూ లేఖ రాశారు హసీనా. “ఎక్స్‌లెన్సీ, సుమీ, ఒబ్లాస్ట్‌లో చిక్కుకుపోయిన భారతీయులతో పాటు కొంత మంది బంగ్లాదేశ్ పౌరులను రక్షించడంలో, తరలించడంలో మీరందించిన సహకారాన్ని, మద్దతును మర్చిపోలేం. మీరు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు బంగ్లాదేశ్, భారత్ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ… బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాలు, తన తండ్రి షేక్ ముజుబుర్ రెహమాన్ జయంతి వేడుకలకూ మోదీ హాజరైన విషయాన్ని ప్రస్తావించారామె.
గతేడాది అన్ని రంగాల్లోనూ అర్థవంతమైన కార్యక్రమాల ద్వారా ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి, ఏకీకృతం అయ్యాయని హసీనా అన్నారు. ఇరుదేశాలు పరస్పరం అండగా నిలుస్తున్నాయని, ఇరు దేశాల ప్రజల సమష్టి ఆకాంక్షలను సాకారం చేసేలా ఇక ముందూ కలిసి పనిచేస్తాయనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
ఆపరేషన్ గంగా కింద 18 దేశాలకు చెందిన 147 మంది విదేశీ పౌరులను భారత్ తరలించింది. ఇక యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన మొత్తం 20వేల మంది పౌరుల తరలింపును పూర్తి చేసింది భారత్. ఇంకా స్వల్ప సంఖ్యలో మిగిలి ఉన్నవారి కోసం పోలండ్, రుమేనియా, హంగేరీ నుంచి ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి.
ఇందుకోసం విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన 47 మంది అధికారులను పంపారు. మొత్తం 90 విమానాలు ఆపరేషన్ గంగలో పాల్గొన్నాయి. వాటిలో 14 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు. చాలా ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ కూడా ఉన్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)