కర్నాటకలో మొదలైన హిజాబ్ గొడవ ఓ హిందూ కార్యకర్త హత్యకు దారితీసింది. శివమొగ్గలో బజరంగదళ్ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. 26 ఏళ్ల హర్షను దుండగులు పొట్టనపెట్టుకున్నారు. అత్యంత దుర్మార్గంగా అతన్ని నరికి చంపారు. హిజాబ్ ను నిరసిస్తూ కాషాయ కండువా మెళ్లో వేసుకుని నిరసన తెలపడమే అతను చేసిన నేరం. హర్ష హత్యతో శివమొగ్గలో ఉద్రిక్తం నెలకొంది. హిందూసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. హత్యకు ముందు హర్షకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి తొమ్మిదిన్నరకు కామత్ పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘటన జరిగింది. శివమొగ్గ జిల్లా సీగేహట్టికి చెందిన హర్ష కులవృత్తి అయిన జర్జీ పనిచేస్తుంటాడు. బజరంగదళ్ కార్యకర్తగా ధర్మ పోరాటాలు చేస్తుంటాడు. రాష్ట్రంలో కొన్నిరోజులుగా హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసింది. విద్యాసంస్థల్లో అందరికీ యూనిఫాం ఉండాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళనల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు హర్ష. దీంతో ప్రత్యర్థులు ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
రక్తపు మడుగులో ఉన్న హర్ష మృతదేహానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. దుండగులు అతని శరీరాన్ని కత్తిపోట్లతో చిద్రం చేసినట్టు తెలుస్తోంది. హర్ష హత్యను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శివమొగ్గలో ఆందోళనలకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీగేహట్టిలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం అక్కడ 144 సెక్షన్ విధించింది. పెద్దఎత్తున పోలీసు బలగాల్ని మోహరించి పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
హర్ష హత్య నేపథ్యంలో శివమొగ్గ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలను మూసివేసినట్టు తెలిసింది. సినిమా హాళ్లు, వాణిజ్య సముదాయాల్ని రాత్రి 9 గంటలలోపు మూసివేయాలని అధికారులు ఆదేశించినట్టు సమాచారం.