మన తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి పడి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి కోసం నలభై రోజుల దీక్ష పూనిన అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సామూహిక పడి పూజలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామంలో అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి మొదటి తేదీన పడిపూజ చేయటం ఆనవాయితీ. ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి వారి పల్లకి శోభాయాత్ర ,మహా పడిపూజ కార్యక్రమం, అన్న సమర్పణ, పంచామృత పంపిణి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా స్థానిక రామాలయంలో జరిగిన మహా పడిపూజ కార్యక్రమానికి సుమారు 3000 మంది భక్తులు హాజరైనట్లు అంచనా, కిక్కిరిసిన భక్తజన సందోహం మధ్య విశాల్ గురు స్వామి పూజా కార్యక్రమాలను ,అభిషేక ప్రక్రియను శాస్త్రోక్తంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. అనంతరం సామూహికంగా ఆలపించిన పాటలకు భక్తులందరూ కూడా తన్మయులై చప్పట్లతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అయ్యప్ప సేవా సమితి చొరవను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్ చెట్లపల్లి సదానందం ,రామాలయ కమిటీ చైర్మన్ జీవి రమణ ఇంకా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ,భక్తులు పాల్గొన్నారు. మహా పడిపూజ కార్యక్రమానికి నిధి సమర్పణ చేసిన దాతలకు అయ్యప్ప సేవా సమితి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.