……………………………………………………………
తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు కొత్త కష్టం వచ్చింది. విమానాల ప్రయాణాలు ఆలస్యం అయిపోతుండటంతో భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. శబరిమలై మకరవిళక్కు సీజన్ లో రోజుకు సగటున 80–90 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకొంటారు. వీరిలో గణనీయంగా తెలుగు భక్తులే ఉంటున్నారు. ప్రత్యేకంగా రద్దీ రోజులలో క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సాధారణ దర్శనానికి 8 నుంచి 12 గంటల వరకూ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విమానాల ఆలస్యాలు భక్తులకు ఇబ్బందిగా మారుతున్నాయి.
…………………………………….
తెలుగు భక్తులకు అయ్యప్ప దీక్షలు, శబరిమలై యాత్ర ప్రత్యేక ఆధ్యాత్మిక భావోద్వేగంతో ముడిపడి ఉంటాయి. మాలధారణ నుంచి ఇరుముడి వరకు అన్ని దశలను ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఇరుముడి కట్టుకొని నిష్టతో శబరిమలై కు బయలుదేరతారు. త్వరగా గమ్యం చేరుకొనేందుకు చాలా మంది విమానాలను ఎంచుకొంటున్నారు. కానీ, ఇండిగో విమానాలు ఆలస్యంగా నడవడం వల్ల గమ్యస్థానానికి సమయానికి చేరుకోలేకపోతున్నారు.
………………………..
శబరిమలైలో ప్రస్తుతం ఆన్లైన్ దర్శన స్లాట్ వ్యవస్థ అమలులో ఉంది. చాలా మంది తెలుగు భక్తులు ముందుగానే విమాన టికెట్లు కొనుగోలు చేసి, వాటికి సరిపోయేలా దర్శన స్లాట్లను బుక్ చేసుకుంటారు. కానీ విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో వారు నిర్ణయించిన స్లాట్లు మిస్ అవుతున్నాయి. ఒకసారి స్లాట్ మిస్ అయితే మళ్లీ దర్శనం పొందేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది భక్తులు దర్శనం చేయలేక నిరాశగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితే ఏర్పడుతోంది.
…………………..
శబరిమలై రద్దీ సమయంలో వసతి వ్యవస్థలు కూడా పరిమితంగానే లభిస్తాయి. ప్రయాణం ఆలస్యమవడంతో బస, రవాణా, తదుపరి ఏర్పాట్లు అన్నీ గందరగోళంగా మారుతున్నాయి. ఇప్పటికే అధిక ఖర్చులు భరించి ప్రయాణించే భక్తులకు విమానాల ఆలస్యాలు మరింత భారంగా మారాయి. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు.
……………………..
ప్రతి ఏడాది ఈ సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలై చేరుకుంటారు. అందుచేత ఈ సీజన్ లో కొచ్చిన్, తిరువనంత పురం విమానాలను అయినా వేగంగా క్రమబద్దం చేయాలని భక్తులు కోరుకొంటున్నారు.

