ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాలకు సాధ్యమైనంత వరకు స్వయంప్రతిపతి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. తిరుపతి ఆశా కన్వెన్షన్లో అంతర్జాతీయ ఆలయాల సదస్సు-ప్రదర్శన (ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో-ఐటీసీఎక్స్-2025) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ కూడా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ లేఖ ద్వారా తన సందేశాన్ని అందించగా, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీసుకుంటున్న చొరవను చంద్రబాబు వివరించారు. దేవాలయాల రక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని, ఇటీవలే దేవదాయ శాఖ చట్టాన్ని సవరించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్చకుల పారితోషికాలు పెంచామని గుర్తు చేశారు. హిందూయిజం, జైనిజం, సిక్కిజం, బుద్ధిజం ఈ నాలుగు భారతదేశంలోనే పుట్టాయని, సనాతన ధర్మ పరిరక్షణలో వీటి పాత్ర కూడా కీలకమని తెలిపారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, ఆదాయ వనరులు కూడా అని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రూ. 6 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం ఆలయాల ద్వారా వస్తోందని ఆయన గుర్తు చేశారు. భక్తులు ఇచ్చే కానుకలు వారు దేనినైతే ఉద్దేశించి ఇస్తారో దానికే ఖర్చు చేయాలని, దీంతో పాటుగా ధార్మిక కార్యక్రమాలకు విని యోగం చేయాల్సి ఉందని చెప్పారు.
ఐటీసీఎక్స్-2025 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన ఆలయాల ట్రస్టులను ఏకం చేస్తోందని, ఆలయాల ఉత్తమ నిర్వహణ, భద్రత, పారదర్శక ఆర్థిక వ్యవస్థల కోసం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆలయాల యాజమాన్యాలను ఒకే వేదికపైకి తెచ్చి ఆలయాల అభివృద్ధితో పాటు భక్తుల సంక్షేమానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు.
ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉన్నది. వారణాసీలో తొలి సదస్సు నిర్వహించిన ఐటీసీఎక్స్ రెండో సదస్సును తిరుపతిలో నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1,500కు పైగా ఆలయాల కమిటీలు కలుస్తుండడం గొప్ప విషయం. వర్చువల్గా కూడా ఎంతోమంది ప్రముఖులు పాల్గొంటున్నారు. ప్రత్యక్షంగా 111 మంది వక్తలు పాల్గొని ఆలయాల నిర్వహణపై దిశానిర్దేశం చేస్తుండడం ప్రశంసనీయం. 15 వర్క్షాపులతో పాటు 60కి పైగా వివిధ స్టాల్స్ ఏర్పాటు ఆలయాల సక్రమ నిర్వహణకు ఉపకరిస్తాయి.
మొత్తం మీద ఒక జాతీయస్థాయి ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరుపతి వేదికగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వము పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోంది