ఔరంగాబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్ధవ్ థాకరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రకటన చేసిన అనంతరం పేర్లను మార్చినట్టు ప్రకటించారు. ఔరంగాబాద్ పేరు మార్చడానికి శివసేన చాలా కాలంగా ప్రయత్నిస్తోంది, చాలా మంది పేరు మార్పుతో ఆశ్చర్యపోయారు.
బాలాసాహెబ్ ఠాక్రే 1988లో ఔరంగాబాద్ పేరును సంభాజీ నగర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. ఆ ఏడాది జరిగిన ఔరంగాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో, శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయోత్సవ ర్యాలీలో ఠాక్రే నగరాన్ని శంభాజీ నగర్‌గా మారుస్తామని ప్రకటించారు.
అప్పటి నుంచి శివసేన తన రాజకీయ ప్రసంగాలలో ఔరంగాబాద్ కంటే శంభాజీ నగర్గానే ప్రస్తావిస్తోంది. ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) 1995లో ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మార్చాలని తీర్మానం చేసింది. ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే జూన్ 8న తన పార్టీ స్వాభిమాన్ ర్యాలీలో మాట్లాడుతూ ఔరంగాబాద్‌కు శంభాజీ నగర్‌గా పేరు మార్చడానికి తన తండ్రి బాల్ థాకరే చేసిన నిబద్ధతను మరచిపోలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పేరు మార్పు విషయంలో శివసేనకు కాంగ్రెస్ మద్దతు లభించలేదు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చడంపై వారు తరచూ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల పేర్లను మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.