అటు భద్రకాళి- ఇటు భద్రలోక్
పశ్చిమ బెంగాల్లో ఏకంగా 8 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. శాంతిభద్రతల సమస్య అక్కడ ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మమతా బెనర్జీ పాలనలో బెంగాల్ రాజకీయ హింసకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఆరోపణలు మాత్రమే కాదు. అవి నిజమే అనే విధంగా తరచూ బిజెపి కార్యకర్తల హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి బెంగాల్లో పాగా వేసి తీరాల్సిందే అని కమలనాథులు గట్టి పట్టుదలతో ఉన్నారు. ముచ్చటగామూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని మమతా బెనర్జీ తహతహలాడుతున్నారు. అమె ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు బిజెపికి వరంగా మారాయి. భద్రకాళి, దుర్గాపూజకు పెట్టింది పేరు బెంగాల్. అక్కడ భద్రకాళి మాత తమను కరుణిస్తుందని కమలనాథులు నమ్ముతున్నారు. అలాగే భద్రలోక్ అండ కూడా విజయాన్ని ఇస్తుందని గంపెడాశతో ఉన్నారు. బెంగాల్ లోని హిందువుల్లో ఎలైట్ వర్కింగ్ క్లాస్ ను, అంటే సామాజికంగా అగ్రవర్ణాలు, ఆర్థికంగా సంపన్న, మధ్య తరగతి వారిని భద్రలోక్ గా అభివర్ణిస్తుంటారు. వీరి లో చాలా మంది ఇప్పుడు బిజెపి ప్రభావంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు బిజెపి అక్కడ అనామక పార్టీ. ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ ను సవాల్ చేస్తున్న ప్రధాన ప్రత్యర్థి. హిందువుల్లో చైతన్యం పెల్లుబికిన ఫలింగా- పరివర్తన ఖాయమనేది బిజెపి నేతల నమ్మకం. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇటీవల బెంగాల్లో పలు సభల్లో ప్రసంగించారు. ఆ పార్టీ ర్యాలీలు, సభలకు జనం పోటెత్తడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. 2014లో బెంగాల్లో కేవలం రెండు సీట్లు గెల్చుకున్న బిజెపి, 2019లో ఏకంగా 18 ఎంపీ సీట్లను గెల్చుకుంది. తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లతో సరిపెట్టుకుంది. అంటే సీట్ల సంఖ్యలో ఎక్కువ తేడా లేదు. ఓట్ల సంఖ్యలో కూడా అంతే. బిజెపి ఆ ఎన్నికల్లో 40.7 శాతం ఓట్లు పొందింది. తృణమూల్ 43.3 శాతం ఓట్లు పొందింది. ఆ తర్వాత గత ఏడాదిన్నర కాలంఓ బిజెపి మరింత దూకుడుగా బలం పెంచుకుంది. కోల్ కతా చుట్టు పక్కల దీదీ పార్టీకి చెమటలు పట్టిస్తోంది. అంతే కాదు గ్రామీణ ప్రాంతాల వరకూ పట్టును పెంచుకుంది. ఆర్ ఎస్ ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థల అండతో అధికారంలోకి రావడానికి బిజెపి చావో రేవో అనే విధంగా ఎన్నికల యుద్ధానికి ఇప్పటికే సిద్ధమైంది. చైతన్యవంతులైన హిందువులే తమను గెలిపిస్తారనే కమలనాథుల నమ్మకం నిజమవుతుందో లేదో చూద్దాం.