జే ఎన్ యూలో లెఫ్ట్ వింగ్ విద్యార్థులు మళ్లీ రెచ్చిపోయారు. ఏబీవీపీ విద్యార్థులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎయిమ్స్ తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఆదివారం రాత్రి రెండు వర్గాల విద్యార్థుల మధ్య వాగ్వాదంతో మొదలైన గొడవ పరస్పర దాడికి దారితీసిందని పోలీసులు తెలిపారు.
తాము సమావేశం నిర్వహించుకుంటుండగా ప్రత్యర్థి గ్రూపు హాల్లోకి దూసుకొచ్చి వ్యతిరేక నినాదాలు చేసిందని..కాసేపట్లో సమావేశాన్ని ముగిస్తామని చెప్పినా వినకుండా భయపెడుతూ తమ మీదకి వచ్చారని ఏబీవీపీ విద్యార్థులు చెబుతున్నారు. ఈ గది తమ సొంతమని అడక్కుండా ఎలా వాడుకుంటారంటూ దాదాపు 100మంది తమ వాళ్లపై దాడి చేశారని ఏబీవీపీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ శివమ్ చౌరాసియా అన్నారు. అసలైతే తాము అనుమతి తీసుకునే సభ నిర్వహించుకుంటున్నామని…చెబుతున్నా వినకుండా అంతరాయం కలిగిస్తూ దాడి చేశారని…మహిళలు, దివ్యాంగులపై కూడా చేయి చేసుకున్నారని ఏబీవీపీ విద్యార్థినాయకులు ఆరోపించారు. ‘ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్’, ‘ఏబీవీపీ ముర్దాబాద్’, ‘ఏబీవీపీ క్యాంపస్ చోడో’ వంటి నినాదాలతో తమను బెంబేలెత్తించారని వారు వాపోయారు. ఈ దాడిలో ఓ విద్యార్థి వేళ్లు విరగాయి…ఓ దివ్యాంగుడికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలకూ సర్దిచెప్పి గాయపడిన ఏబీవీపీ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.