మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రికార్డులు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రుల వివరాల విషయంలో చెరో అంశంలోనూ టాప్ గా నిలుస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా కేసులు ఉన్నట్లు లెక్క తేలింది. ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే సంపన్నుడైన సీఎంగా నిర్ధారించారు. దీంతో రెండు విషయాల్లో ఇద్దరూ టాప్ ప్లేస్ ఆక్రమించారు.
…
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ అనే సంస్థ వెల్లడించింది. నేషనల్ ఎలక్షన్ వాచ్ తో కలిసి ఒక నివేదికగా రూపొందించటం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ఆ రెడ్డి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల విషయంలో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ గా నిలుస్తున్నారు. ఆయన మీద మొత్తంగా 89 కేసులు ఉండగా, వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొన్నది. నేరపూరిత బెదిరింపు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం , మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి ప్రేరేపించడం, ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, మతవిశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు. ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా మంది సీఎంల మీద పబ్లిక్ లో గొడవలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగా, రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోస్థానంలో ఉన్నారు.
..
ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రికార్డు ని క్రియేట్ చేశారు. దేశంలోనే ధనికులైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. మొత్తం 31 మంది సీఎంల అధికారిక ఆస్తుల వివరాలను లెక్కించారు. ఇందులో చంద్రబాబు కి అత్యధికంగా 931 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఆయన తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండ్ నిలుస్తున్నారు. ఆయన ఆస్తులు 332 కోట్లు మాత్రమే. ఇక మూడో స్థానంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 51 కోట్లు మాత్రమే.
….
అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున రూ.52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే. దీనిని బట్టి మన సీఎంల రేంజ్ అర్థం అవుతుంది.
…
మొదట నుంచి ఆదాయపు వివరాలను బహిర్గతం చేయటం చంద్రబాబుకి అలవాటు. దీంతో అధికారిక ఆస్తుల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారు. ఇక, పోరాటం ద్వారా పైకి ఎదిగిన రేవంత్ రెడ్డి మీద ఎక్కువగా అటువంటి కేసులే ఉన్నాయి. ఈ విధంగా ఇద్దరు నాయకులు రికార్డు సృష్టించారు అన్న మాట.